కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో ఎంతో ఆశతో ప్రారంభించిన కొత్త మోడల్ మార్కెట్ మహిళా వ్యాపారుల పాలిట ఆవేదనకు నిలయంగా మారింది. అధికారుల సూచన మేరకు పాత మార్కెట్‌ను వదిలి కొత్త మోడల్ మార్కెట్‌కు వచ్చిన కూరగాయలు, ఆకుకూరల మహిళా వ్యాపారులు కొనుగోలుదారులు లేక రోజంతా ఎదురుచూసి నిరాశతో ఇళ్లకు చేరుకుంటున్నారు.
తెల్లవారుజామునే కూరగాయలు కొనుగోలు చేసి మార్కెట్‌కు వచ్చినా అమ్మకాలు లేక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని వారు వాపోతున్నారు. కుటుంబ పోషణకు ఈ వ్యాపారమే ఆధారంగా ఉండగా రోజురోజుకూ ఆదాయం తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కొత్త మార్కెట్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించి తమ జీవనాధారాన్ని కాపాడాలని మహిళా వ్యాపారులు కోరుతున్నారు.
న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మహిళా వ్యాపారుల వినతి
తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లిన మహిళా వ్యాపారులు, కొత్త మోడల్ మార్కెట్‌లో వ్యాపారాలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌కు ప్రజల రాకపోకలు పెరిగేలా చర్యలు చేపట్టడంతో పాటు వ్యాపారులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు.
మోడల్ మార్కెట్‌ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్
మహిళా వ్యాపారుల సమస్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ మోడల్ మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.






