పాలకులు మారినా పంపిణీ జరగట్లే!
- ఐదేళ్లు దాటినా కుదరని ముహూర్తం
- శిథిలావస్థకు చేరుకుంటున్న డబుల్ బెడ్రూం ఇండ్లు
- అర్హులకు అందించాలని వేడుకోలు
నూతనకల్, జూన్ 8: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగానే మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలో, మొదటి విడత కింద 4 గ్రామాల్లో ఈ ఇండ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. కానీ గత ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మండల పరిధిలోని పెద్దనెమిలా,బిక్కుమల్ల గ్రామాల్లో కేవలం పిల్లర్ల వరకే నిర్మించి వదిలేశారు. ఇప్పటికీ అక్కడ పనులు ముందుకు సాగకపోవడం శోచనీయం.
ఐదేళ్లు దాటినా కుదరని ముహూర్తం!
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి గత ప్రభుత్వం 32 డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించింది. కాంట్రాక్టర్ ఐదు సంవత్సరాల క్రితమే ఇండ్ల నిర్మాణంతో పాటు, వీధుల వెంట సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు.కేవలం విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఈ ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ పాలకులు మారినా ఇండ్ల పంపిణీ మాత్రం జరగడం లేదు.గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు,ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిచిపోయింది.ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి.
చెదలు పడుతున్న తలుపులు.. దొంగిలిస్తున్న వాటర్ ట్యాంకులు!
నిర్మాణం పూర్తయిన వెంటనే ఇండ్లను పంపిణీ చేసి ఉంటే పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఆసరాగా ఉండేది.కానీ పాలకుల,అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇండ్లకు అమర్చిన తలుపులు,కిటికీలు చెదలు పట్టి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించగా,మిగిలిన ట్యాంకులు ఎండకు ఎండి,వానకు తడిసి పగిలిపోయి నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.
నిరుపేదలకే ఇల్లు వచ్చేలా చూడాలి
గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇల్లు మంజూరు చెయ్యాలి .ఇళ్ల కొరకు మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తులు చేసుకున్నారు. ఇంతవరకు లబ్ధిదారు లను ఎంపిక చేయలేదు. కట్టిన ఇల్లు శిథిలావస్థలో చేరుకున్నాయి. గ్రామంలో సొంత ఇల్ల స్థలం కూడా లేని పేదలు ఎందరో ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ములు ఇరుకు గదుల్లో నివసిస్తూ నరకం చూస్తున్నారు. మరికొందరు గుడిసెలలో ఉంటూ వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, అర్హులైన పేదలను గుర్తించి వెంటనే ఈ ఇండ్లను పంపిణీ చేయాలి.
బత్తుల విజయ్, శిల్పకుంట్ల గ్రామం, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు






