11 April, 2026 | 3:18 AM

దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేత

11-04-2026 01:14 AM

చేవెళ్ల ఏప్రిల్ 10(విజయక్రాంతి): కేంద్రం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాంగణంలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఏఎల్‌ఐఎంసీవో ) సంస్థ ద్వారా దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని  అన్నారు. తాను ఏడాది కింద చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న దివ్యాంగులకు సహాయం అందించాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత ఏఎల్‌ఐఎంసీవో సంస్థ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 6 క్యాంప్ లు నిర్వహించి అర్హులను గుర్తించి ఐవోసీఎల్ సంస్థ  సహకారంతో ఈ పరికరాలు అందిస్తున్నామన్నారు. ఏప్రిల్ 13, 15 తేదీల్లో శంషాబాద్, సరూర్ నగర్ లో కూడా అర్హులకు పరికరాలు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్ చైర్ పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, ఐవోసీఎల్ డీసీఎం కైలాష్ కాంత్,  ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి, ఎంఆర్ వో కృష్ణయ్య పాల్గొన్నారు.