ప్రభుత్వ భూముల కబ్జాపై బీఆర్‌ఎస్ పోరు
అడిషనల్ కలెక్టర్కు సబితా ఇంద్రారెడ్డి బృందం ఫిర్యాదు
రంగారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ నేతలు అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు గళమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గం లో ని నాదర్గుల్ ప్రాంతంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
నాదర్గుల్, సర్వే నంబర్ 673 లో సుమారు 373 ఎకరాల భూమి అన్యకాంతం పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి మరియు ఇతర నేతలు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి కి వినతి పత్రం అందజేసీ అధికార పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మంత్రి మరియు కొందరు ముఖ్య నేతలు బౌన్సర్లు, గుండాలను అడ్డం పెట్టుకొని పేద రైతులపై దాడులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో సాగు చేసుకుంటున్న సుమారు 600 మంది రైతులను అన్యాయంగా గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల బోర్లను పగలగొట్టి, వారిని భౌతికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఆర్డీఓ (RౄO) కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు రక్షణ కల్పించాలని బీఆర్‌ఎస్ నేతలు అడిషనల్ కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రభుత్వ భూములను కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తుండగా, దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.




