23 July, 2026 | 1:52 AM

నిహాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

23-07-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 22:  విద్యార్థులు క్రమశిక్షణ,పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని పున్న నిహాల్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పున్న రాధికనరేందర్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని సూర్యానాయక్ తండా ప్రాథమిక పాఠశాల, భాషా నాయక్ తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తమ కుమారుడు స్వర్గీయ నిహాల్ జన్మదినం సందర్భంగా రూ.20వేలు విలువచేసే స్కూల్ బ్యాగులు,నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిల్ లను ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని,రానున్న రోజుల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.తదనంతరం జిల్లా కేంద్రం సూర్యాపేటలోని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు అన్నదానం చేశారు.ఆయా కార్యక్రమాల్లో పాఠశాల హెచ్‌ఎంలు కే రమేష్,పున్న నరేందర్,ఉపాధ్యాయులు లింగయ్య,ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ ఆంగోతు నర్సింహ,వార్డు సభ్యుడు వెంకటేష్ స్థానికులు నాగులు,రవి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.