18 July, 2026 | 10:47 AM

ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ

02-07-2024 12:36 AM
  • మంగళగిరి నుంచి సీఎం చంద్రబాబు శ్రీకారం

హైదరాబాద్, జులై 1 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అట్టహాసంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హమీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు పెంచిన పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తొలిరోజు పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. ఎస్టీ కాలనీవాసి బానావత్  పాములు నాయక్ అనే వృద్ధుడికి తొలి పింఛను అందించారు. ఎన్నికల్లో లోకేష్‌ను ఆదరించి, గెలిపించినందుకు మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

పిఠాపురం ప్రజలకు రుణ పడి ఉంటా..: పవన్ కల్యాణ్

అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గోల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛను పంపిణీ  చేసి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచామమే కానీ తగ్గించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీ అభివృద్ధికి మంజూరైన నిధులను ఎటువైపు మళ్లించిందో ఆరా తీస్తున్నామన్నారు.

అభాసుపాలైన పింఛన్ల పంపిణీ..

ఏపీ ప్రభుత్వం అట్టహసంగా ప్రారంభించిన పింఛన్ల పంపినీ కొన్నిచోట్ల అభాసుపాలైంది. పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. మరికొన్ని పింఛన్ల పంపిణీలో అధికారులు చేతివాటం చూపించారు. ఇంకొన్నిచోట్ల సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. అనేక చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజిలివ్వడం విమర్శలకు తావిచ్చింది. మాచర్ల పట్టణంలోని 9వ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ మూడావత్  వాలూనాయక్ పింఛనుదారుల నుంచి రూ.500 చొప్పున  కమిషన్ వసూలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో వాలూనాయక్‌ను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేశారు. 

పింఛన్ నగదు చోరీ..

ప్రొద్దుటూరు పట్టణంలోని 7వ వార్డు సచివాలయంలో పింఛన్ కోసం తెచ్చిన రూ.4 లక్షల చోరీకి గురయ్యాయి. సచివాలయ సిబ్బంది మురళీమోహన్ ఆ సొమ్మును తీసుకెళ్లగా, తాను డబ్బు తీసుకు వస్తున్న సమయంలో పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కళ్లు తిరిగి పడిపోయానని, అప్పుడు ఎవరో వచ్చి డబ్బు తీసుకెళ్లారని బాధితుడు తెలిపినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.