18 July, 2026 | 10:31 AM

25 వేల మంది ఎస్జీటీలకు బదిలీలు

02-07-2024 12:39 AM
  • కొన్ని జిల్లాల్లో టీచర్లను రిలీవ్ చేయని విద్యాశాఖ 

వెంటనే రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): విద్యాశాఖలో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. ఈక్రమంలో సోమవారం సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)ను విద్యాశాఖ బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఒక్కో జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకు దీంతో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ దాదాపు ముగిసింది.

కోర్టు కేసుల కారణంగా వాయిదా పడిన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయితే ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు. మరోవైపు బదిలీ అయిన ఉపాధ్యాయులను విద్యాశాఖ రిలీవ్ చేయడంలేదనే విమర్శలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం ఎస్జీటీలను రిలీవ్ చేయాలని అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో బదిలీ అయిన టీచర్లను బదిలీ రిలీవ్ చేయడంలేదని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం సోమవారం భారీగానే రిలీవ్ చేసినట్లు సమాచారం.

ఉపాధ్యాయ సంఘం డిమాండ్..

సంవత్సరాల తరబడి ఒకే చోట పనిచేస్తూ బదిలీ పొందిన వారిని, వెంటనే విద్యాశాఖ రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హనుమంత రావు, నవాత్ సురేష్ సోమవారం డిమాండ్ చేశారు. హేతుబద్ధీకరణను చూపిస్తూ ఎస్జీటీలను బదిలీ చేయకపోవడం దారుణమన్నారు. బదిలీ పొందిన వారిని వెంటనే రిలీవ్ చేసి, అవసరం ఉన్న చోట విద్యా వలంటీర్లను నియమించాలన్నారు.