30 August, 2026 | 12:15 AM

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు

29-08-2026 11:43 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ కుమార్‌ షట్కర్‌

దోమకొండ,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. శనివారం దోమకొండలోని రెడ్డి సంఘం ఫంక్షన్‌ హాల్‌లో నూతనంగా మంజూరైన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్‌ అలీతో పాటు జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ కుమార్‌ షట్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. రేషన్‌ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు పొందడంతో పాటు పలు సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుందని పేర్కొన్నారు.ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఎంపీ సురేష్‌ కుమార్‌ షట్కర్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రెడ్డి నాయక్‌, మాజీ జడ్పీటీసీ తిరుమల్‌ గౌడ్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వినీత్‌, గ్రామ అధ్యక్షుడు మధు, మాజీ సర్పంచ్‌ నల్లపు అంజలి శ్రీనివాస్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, నాయకులు అబ్రబోయిన స్వామి, గోపాల్‌రెడ్డి, సిద్ధారం, ఈశ్వర్‌గౌడ్‌, లింగం, సాయిలు, కవిత, శ్రీహరి, నరేష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంజీవ్‌, రామస్వామిగౌడ్‌, సిద్ధారెడ్డి, బాపురెడ్డి, అంజం, జగ్గారెడ్డి, ముత్తాగౌడ్‌, నర్సింలు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు, పాత్రికేయులు పాల్గొన్నారు.