దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం క శనివారం చేపట్టారు.కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సొసైటీ చైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి 12 మంది పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. రైతులకు అండగా రైతు సొసైటీలు పనిచేయాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందనిఅన్నారు.
రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా సొసైటీలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమలు చేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు.
రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, కొంత ఆలస్యం జరిగినా ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. రైతులు చిన్నచిన్న అవసరాల కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలోనే సహకార సంఘాల ద్వారా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ ,తిరుమల గౌడ్, ఇరేని సందీప్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వినీత్, గ్రామ అధ్యక్షులు సీతారాం మధు, గోపాల్ రెడ్డి, సంజీవ్, రామస్వామి గౌడ్, సిద్ధారెడ్డి, బాపురెడ్డి, బాలరాజ్, గ్రామస్థులు పాల్గొన్నారు.






