కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కోయగూడెం ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో(Koyagudem Ashram School) విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌లను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతిరోజూ యోగను అలవాటు చేసుకోవాలని సూచించారు.
యోగ వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని, మంచి ఆరోగ్యం ఉంటేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, ఆరోగ్యం, క్రీడలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌లను పంపిణీ చేసి క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.






