6 May, 2026 | 1:56 AM

ఎదులాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ

06-05-2026 12:00 AM

ఘట్ కేసర్, మే 5 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు జిల్లా కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి మంగళవారం పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎల్. సుగుణబాయి, డీసీఓ నాగలింగచారి, ఆర్డీవో, ఘట్కేసర్ తహసీల్దార్ ఏఈఓ అధికారులు కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరిచి, తూర్పారబట్టి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద విశ్రాంతి తీసుకోవడం, ధాన్యం ఆరబెట్టి కార్యక్రమాలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే నిర్వహించడం ద్వారా ఎండ ప్రభావం నుండి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ లు అందుబాటులో ఉంచడం, ఎండను నివారించేందుకు షెడ్ల ఏర్పాటు వంటి చర్యలను వెంటనే చేపట్టాలని కొనుగోలు కేంద్ర ఇన్చార్జిలను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, బాధ్యతాయుతంగా వ్యవహరించి, కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడం వల్ల రైతుల చెల్లింపులు ప్రభావితo ఆవుతున్నందున, ప్రతి ఎంట్రీను అదే రోజు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన 48 గంటలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయని పేర్కొన్నారు.