1 September, 2026 | 10:29 PM

ఈఎంఆర్ఎస్ ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ అంకిత్

01-09-2026 | 08:28pm

పాఠశాలలో భవనాలు, వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ల పరిశీలన

విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించిన వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ 

స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న,కుళ్ళిన వంట సామాగ్రీ పదార్థాలపై క్యాటరింగ్ అసిస్టెంట్ మంగీలాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ 

సక్రమంగా విధుల నిర్వహించాలని సిబ్బందిని హెచ్చరించిన  జిల్లా కలెక్టర్ 

కొత్తగూడెం(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(Ekalavya Model Residential School) - పాల్వంచను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు.ఈ పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో 2017 ఏడాదిలో నిర్మించగా గతంలో పాల్వంచ ప్రాంతంలో ఉండగా, ప్రస్తుతం కొత్తగూడెం ప్రాంతానికి తరలించిన ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్  వరకు  480 మంది విద్యార్థులకు విద్యా తరగతులు, వసతి సౌకర్యాలు అందుతుండగా, ఆ భవన సముదాయాలను, పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు(Teachers), సిబ్బంది వివరాలు జిల్లా కలెక్టర్ పాఠశాల ఇన్చార్జి మున్సిపల్ ప్రశంజీత్ భూసాల్ ను  అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టీచింగ్ విభాగంలో 23 రెగ్యులర్ సిబ్బంది, 12 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, నాన్ - టీచింగ్ విభాగంలో ఐదుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. 240 మంది బాలికలకు,240 మంది బాలురకు ప్రత్యేక వార్డెన్స్ వేర్వేరుగా ఉన్నారని, పాఠశాల ప్రిన్సిపాల్ ఏ. విజయ గత నెల ఆగస్టు 17వ తేదీ నుంచి సెలవుల్లో ఉన్నట్లు  తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాల ఆవరణలో ఉన్న డైనింగ్ హాలులో వంట వండుతున్న కుకింగ్ ప్రాంతాన్ని  పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటకాలను అన్నం, పప్పు, సాంబార్,రసం, పెరుగు, కోడిగుడ్లను, రాత్రి భోజనం కోసం వంట చేసేందుకు సిద్ధం చేసుకున్న కాయగూరలను పరిశీలించి కుకింగ్ చేసే వంట మనిషితో, హెల్పర్లతో మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారని, నాణ్యతతో కూడిన పౌష్టికాహారం విద్యార్థులకు సిద్ధం చేసి అందజేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడే విద్యార్థులతో పాటు  పాఠశాల ఆవరణ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.

అదేవిధంగా డైనింగ్ హాల్ లో ఉన్న స్టోర్ రూమ్, ఆర్.ఓ.ఆర్ ప్లాంట్ ప్రాంతాలను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో ఉన్న కాయగూరలు, ఉల్లిగడ్డ, నిల్వ ఉన్న పప్పు దినుసులు, బియ్యం,సబ్బులు, సరపు, షాంపులు, తదితర సామాగ్రిని ఎప్పుడు కొనుగోలుచేశారని, ఎంతకాలం నుంచి నిల్వ ఉంచుతారని క్యాటరింగ్ అసిస్టెంట్ మంగీలాల్ నుంచి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిల్వ ఉన్న బెల్లం కుళ్ళి ఉండడాన్ని పరిశీలించి క్యాటరింగ్ అసిస్టెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసి సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏకలవ్య పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సుజాత  తన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళింది.విధులు నిర్వహించాలంటే సెక్యూరిటీ రూమ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని సెక్యూరిటీ రూమ్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.అదేవిధంగా పాఠశాలకు రావాలంటే విద్యార్థులు,ఉపాధ్యాయ సిబ్బంది  సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అంతర్గత రోడ్లు పరిస్థితి మరీ దారుణమని పలు సమస్యలు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, రెవెన్యూ సిబ్బంది బాలరాజు తదితరులు పాల్గొన్నారు.