జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
- ఇసుక అక్రమ తవ్వకాలు
- జోరుగా సాగుతున్న అక్రమ రవాణా
తాండూరు, ఏప్రిల్ 3, (విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ వాగు లో అనుమతులు ఏవి లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. యదేచ్ఛగా అక్రమార్కులు అక్రమ రవాణా కూడా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత మైన్స్, రెవెన్యూ పోలీస్ ధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం సంబంధిత కాంట్రాక్టర్ అనుమతి తీసుకున్నాడు.
అయితే ఇదే అదనుగా అనుమతులు ఓ చోటికి తీసుకొని మరోచోటికి ఇసుక రవాణా చేస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. అక్రమ రవాణా, తవ్వకాలకు అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు పాల్పడుతున్న వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని. .
వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. అయినా కూడా అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో హిటాచి లాంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ భారీ టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తూ యదేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు.
శ్రీనివాస్ సిఐటియు జిల్లా కార్యదర్శి.. ఏమంటున్నారంటే.
అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చంద్రవంచ వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుకోవడంతో భూగర్భ జలాలు పడిపోయి పరిసర ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సంబంధిత రెవెన్యూ, గనులు భూగర్భ శాఖ, పోలీసుఅధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేయాల్సిన అవసరం ఉంది.
తాండూర్ మండల తాసిల్దార్ తారా సింగ్ ఏమంటున్నారంటే.
చంద్రవంచలో చెక్ డాం నిర్మాణం, కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం మార్చి నెల చివరి వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని అనుమతులు లేకుండా తవ్వకాలుగాని, రవాణా గాని చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాలు జప్తు చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.




