05-08-2025 12:33:36 AM
హర్షం వ్యక్తం చేసిన గిరిజన నాయకులు
నాగల్ గిద్ద, ఆగస్టు 4: నాగల్ గిద్ద మండలం కిషన్ నాయక్ తండా గ్రామ పంచాయతీకి చెందిన అనాథ బాలికను కరస్గుత్తి గిరిజన పాఠశాలలో అడ్మీషన్ కల్పించారు. విజయక్రాంతి దినపత్రికలో గతనెల 24న అనాథ బాలికను ఆదుకునేది ఎవరు? అనే కథనానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. తల్లిదండ్రులు లేని అనాథ బాలిక సింధూకి చదవాలని ఉన్నా సీటు దక్కలేదు.
అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని విజయక్రాంతిలో ప్రచురితం కావడంతో తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి నాగల్ గిద్ద తహశీల్దార్ శివరామకృష్ణకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన స్థానిక ఎంఈఓ మన్మధ కిషోర్ తో కలిసి గురుకుల ఆర్సీఓతో మాట్లాడి సింధుని కరస్ గుత్తి గిరిజన గురుకుల పాఠశాలలో ఆరవ తరగతిలో సోమవారం నాడు అడ్మిషన్ చేయించారు.
కాగా సింధుకు అవసరమయ్యే నెలవారీ ఖర్చు డబ్బులు సైతం అందిస్తామని తహసిల్దార్ పేర్కొన్నారు. దీంతో తాండలోని ప్రజలతో పాటు మండల గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బంజారా సేవాలాల్ సంఘం నాగల్ గిద్ద మండల అధ్యక్షులు రాందాస్ నాయక్ విజయక్రాంతి దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.