calender_icon.png 5 August, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియా పై రైతులకు అవగాహన

05-08-2025 08:33:42 AM

జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూప రాణి.

(విజయక్రాంతి ఎఫెక్ట్)

కొండపాక (విజయక్రాంతి): పొడి ఎరువుల కంటే ద్రవ రోపంలో ఉన్న నానో ఎరువులు రైతులకు లాభదాయకమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని స్వరూప రాణి అన్నారు. కొండపాక మండలంలోని బందారం గ్రామంలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డిఏపి వాడకంపై రైతులకు సోమవారం అవగాహన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూప రాణి మాట్లాడుతూ సాధారణంగా ఉపయోగించే పొడి యూరియా, పొడి డిఏపి మొక్కలకు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉపయోగపడుతుండగా మిగతాది వృధా అవుతూ నేలలో, గాలిలో కలిసి కాలుష్యానికి దారి తీస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సాంకేతికతలో భాగంగా నానో యూరియా, డిఏపి వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించడమే కాకుండా సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చున్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ఒక సాంప్రదాయ 45 కిలోల  బ్యాగుకు సమానమైన పోషకాలను పంటలకు అందిస్తుందన్నారు. నానో యూరియా ధర 500 మిల్లీ లీటర్ల బాటిల్ కు రూ.225 లకు లభిస్తుందన్నారు. సాంప్రదాయ యూరియా అధికంగా వాడడం వల్ల పురుగులు పెరిగి పంటకు, పర్యావరణానికి నష్టం కలిగిస్తుందన్నారు. ద్రవరూప నానో ఉత్పత్తులపై మొగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల పంట పొలాలపై డ్రోనుతో పిచికారి చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏడిఏ  బాబు నాయక్, కొండపాక మండల వ్యవసాయ అధికారి జి శివరామకృష్ణ, ఇఫ్కో ఏరియా మేనేజర్ చంద్రబాబు,  ఎఫ్ పి ఓ కొండపాక పాలకవర్గం, ఏఈవోలు, తోర్నాల వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు, రైతులు పాల్గొన్నారు.