05-08-2025 09:03:28 AM
పెన్ పహాడ్ : భూ తగాదా గెట్టు విషయం లో దాయాదులపై దాడి చేసిన ఇద్దరు (అన్నదమ్ములు) ఖాకీలపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. డీస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం(Neredcherla mandal) బక్కయ్య గూడెంకు చెందిన సోదరులు శణం రామలింగయ్య, శణం వెంకటేశ్వర్లు కు పెన్ పహాడ్ మండల లింగాల శివారులోని వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి గెట్ల విషయంలో ఇరువురి అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొంది.
గత నెల 3న శానం రామలింగయ్య కుమారుడు భరత్ కుమార్ తన భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా శణం వెంకటేశ్వర్లు, భార్య వీరభద్రమ్మ, వీరి ఇద్దరు కుమారులైన 12న బెటాలియన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణరావు, నాగేంద్రబాబు కలసి సైకిల్ చైన్లతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రామలింగయ్య ఆయన కుమారుడు భరత్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సంబంధిత నివేదికల ఆధారంగా ఇద్దరు ఖాకీలను సస్పెండ్ చేస్తూ 12 బెటాలియన్ కమాండెడ్ వీరయ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు డీస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, పెన్ పహాడ్ ఎస్ ఐ గోపికృష్ణ , సిబ్బంది ఉన్నారు.