25 July, 2026 | 1:47 AM

స్పెషల్ పార్టీ సిబ్బందితో జిల్లా ఎస్పీ దర్బార్

25-07-2026 12:00 AM

విశేష సేవలకు ప్రశంసలు, రివార్డులు

ములుగు, జులై 24 (విజయక్రాంతి): కర్రెగుట్టల రహదారి పనుల్లో సేవలందించిన స్పెషల్ పార్టీ సిబ్బందికి ములుగు జిల్లా ఎ స్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ప్రశంసించారు. ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎ స్పీ స్పెషల్ పార్టీ సిబ్బందితో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, సం క్షేమ అంశాలు, భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, అభ్యర్థనలను స్వయంగా తెలుసుకుని వారితో చర్చించారు.

దర్బార్లో సిబ్బంది పోలీసు హెడ్ క్వార్టర్స్ లో తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సిబ్బంది విశ్రాంతి కోసం పోలీస్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఏర్పాటు చేసే దిశగా సంబంధిత అధికారులకు ఎస్ పి గారు ఆదేశాలు జారీ చేసారు. మేడారం సమయంలో అధికారుల చొరవతో ప్రయాణ బత్యం లభించగా, మరి కొన్ని నెలల ప్రయాణ బత్యం రావాల్సి ఉందని సిబ్బంది ఎస్ పి గారిని అభ్యర్ధించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఎస్ పి గారు హామీ ఇచ్చారు.

అలాగే, కఠిన సేవా పథకాల వంటివి పొందేందుకు అర్హులైన సిబ్బంది వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇటీవల తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా కర్రెగుట్టల కొండ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో విశేష కృషి చేసిన స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్ పి ప్రత్యేకంగా అభినందించారు.

వారి అంకితభావం, క్రమశిక్షణ, సేవలను గుర్తిస్తూ ఉన్నత అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దీర్ఘకాలంగా అంకితభావంతో సేవలందించిన అర్హులైన స్పెషల్ పార్టీ, బాంబు స్క్వాడ్ సిబ్బందికి ఆక్సిలరీ ప్రమోషన్లు కల్పించే అంశాన్ని కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ములుగు డీఎస్పీ ఇన్చార్జి ఓఎస్డి నలువాల రవీందర్, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్ డి తిరుపతి, ములుగు సీఐ దారం సురేష్, ఆర్‌ఎస్‌ఐలు గోపి ప్రశాంత అవినాష్ సందీప్ రాకేష్ సిబ్బంది పాల్గొన్నారు.