25 July, 2026 | 1:47 AM

ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

25-07-2026 12:00 AM

వరంగల్ (మహబూబాబాద్) జులై 24 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు కేటాయించింది, ఎలాంటి మౌలిక వసతులు కల్పించింది, ఆయుష్ సేవలను సాధారణ వైద్య వ్యవస్థతో ఎలా అనుసంధానం చేస్తోంది, అనే అంశాలపై వరంగల్ ఎంపీ లోక్సభలో ప్రశ్న లేవనెత్తారు.

వరంగల్ ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) కింద వరంగల్ జిల్లాలోని తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు, శాశ్వత యోగా షెడ్ల నిర్మాణానికి కేంద్రం మద్దతు అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అభివృద్ధితో పాటు తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలకు అవసరమైన మందుల సరఫరా కోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం గణనీయమైన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. 2023-24లో రూ.56.16 లక్షలు, 2024-25లో రూ.24.32 లక్షలు, 2025-26లో రూ.3.23 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆయుష్ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలో ఆయుర్వేదం, యోగా, హోమియోపతి తదితర ప్రత్యామ్నాయ వైద్య విధానాల విస్తరణకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, ఆయుష్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే విధంగా కేంద్రం కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.