దేశాన్ని ఎంతకాలం పరిపాలించామన్నది ముఖ్యం కాదు
దేశానికి ఏం చేసామన్నదే ముఖ్యం: సతీష్ సావంత్
కూకట్‌పల్లి, జూన్ 16 (విజయక్రాంతి): దేశాన్ని ఎంత కాలం పరిపాలించామన్నది ముఖ్యం కాదని, దేశానికి ఆ పదవీకాలంలో దేశం కోసం ఏం చేశామన్నది ముఖ్యమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సతీష్ సావంత్ అన్నారు. మంగళవారం కూకట్పల్లి ఎం కె ఎన్ ఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఎ అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సతీష్ సావంత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దేశ ప్రధానిగా మోడీ తన పదవీ కాలాన్ని 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని జవహర్లాల్ నెహ్రూ పదవీ కాలాన్ని అధిగమించారని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ ఆ పదవీకాలంలో దేశానికి ఏం చేశామన్నది ముఖ్యమని అది మరిచిపోయి బీజేపీ నాయకులు ఎక్కువ కాలం ఉన్నారని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. దేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ 18 సంవత్సరాలు పనిచేశారని, నెహ్రు తన జీవితంలో దేశం కోసం 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండేదని అమెరికా రస్యాల నుండి బియ్యము గోధుమలు దిగుమతి చేసుకునేదని, దానికి తోడు దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుండి 20 లక్షల మంది భారత్ లోకి వచ్చారని తెలిపారు. ఆహార ధాన్యాల కొరతతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి నెహ్రూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా డ్వాక్రానంగల్ డ్యామ్ లాంటి అనేక డ్యాములు దేశంలో నిర్మించి వ్యవసాయం ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఎన్ని జన్మలెత్తినా జవహర్లాల్ నెహ్రూ స్థాయికి మోడీ సరిపోలేదని విమర్శించారు.
ఎస్ ఐ ఆర్ ద్వారా బిజెపి ఓటు చోరీకి పాల్పడుతుందని, ఓటు చోరీకే కాక సీట్ చోరీకి కూడా బిజెపి పాల్పడిందని మధ్యప్రదేశ్ లో జరిగిన మీనాక్షి నటరాజన్ విషయాన్ని ఎత్తి చూపారు. ఎస్‌ఐ ద్వారా పశ్చిమ బెంగాల్ బిజెపి అధికారంలోకి వచ్చిందని అన్నారు. బి ఎల్ ఏ లు అప్రమత్తతతో ఉండి కాంగ్రెస్ ఓట్లను కోల్పోకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు.మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి ఓటర్ ను తొలగించ కుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల జాబితాలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్నారు.
ఎస్ ఐ ఆర్ విషయంలో బిఎల్‌ఎ లు ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల నమోదు ప్రక్రియలో మార్పులు చేర్పులు తొలగింపుల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బ్లాక్ అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి, తూము వేణు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






