26 March, 2026 | 6:33 PM

వడగండ్ల వానతో పంటల నష్టం

26-03-2026 04:58 PM

 రైతులకు భరోసా ఇచ్చిన షబ్బీర్ అలీ

భిక్కనూర్, మార్చి 26, (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెద్దమల్లారెడ్డి చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట(Crop Damage) పూర్తిగా దెబ్బతినగా, మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా నష్టపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ(Mohammed Ali Shabbir Ali) నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు.

రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమావేశమై వెంటనే పంట నష్టం సర్వే చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తో చర్చించి రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఎకరాకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.