దత్తపుత్రికను తండ్రికే అప్పగించండి
శిశు సంక్షేమ కమిటీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మే 16, (విజయక్రాంతి): దత్తత తీసుకున్న బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తన రెండున్నరేళ్ల దత్త పుత్రికను బలవంతంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తీసుకువెళ్లారంటూ మలక్‌పేటకు చెందిన అరుణ్ కుమార్ గుప్తా, బాలిక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయ మూర్తులు జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిం చింది.
బాలికను 2021 జులై 27న చట్టప్రకారం అరుణ్‌కుమార్ దత్తత తీసుకున్నారు. ఇటీవల శిశు సంక్షేమ శాఖకు అధికారులు వచ్చి తాము బాల రక్షకులమని చెప్పి బాలికను తీసుకెళ్లిపోయారని పిటిషనర్ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా బాలికను తీసుకువెళ్లారని, తిరిగి బాలికను అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ వద్ద అనధికారికంగా బాలిక ఉందన్న ఫిర్యాదు మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదనలో చెప్పారు.
వాదనల విన్న ధర్మాసనం సంరక్షుకులు అసమర్థులని భావించినప్పుడు బాలికను వారి సంరక్షణలోకి తీసుకోవచ్చునని, అయితే అందుకు ఆధారాల్లేవని చెప్పింది. అధికారుల నుంచి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలనే వ్యవహారంలోకి తాము వెళ్లడం లేదని, బాలిక స్వేచ్ఛ వరకే పరిమితమైనట్లు చెబుతూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పరిహారం కావాలని పిటిషనర్ భావిస్తే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.




