8 August, 2026 | 1:14 AM

విడాకుల కేసు వెనక్కి..

08-08-2026 12:00 AM
  1. తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత నిర్ణయం
  2. కేసు ముగిసినట్టు చెంగల్పట్టు కోర్టు ప్రకటన
  3. భవిష్యత్తులో కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అవకాశం

చెన్నై, ఆగస్టు ౭: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఎదుట హాజరై తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భావవిస్తున్నట్టు కోర్టుకు విన్నవించారు. అందుకు ప్రతివాది తరఫు అడ్వొకేట్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో న్యాయస్థానం కేసును ముగిస్తున్నట్టు ప్రకటిస్తూనే, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు సంగీతకు చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించింది. కోర్టు తీర్పుతో విజయ్, సంగీత విడాకుల వివాదం సద్దుమణిగినట్టయింది.

బ్రిటన్‌లో పెరిగిన శ్రీలంక తమిళురాలైన సంగీత ఒక అభిమానిగా విజయ్‌కి పరిచమయ్యారు. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల క్రితం విజయ్ రాజకీయ అరంగేట్రం, తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) స్థాపన తర్వాత దాంపత్యంలో పొరపొచ్చాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భర్త వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించానని, తనకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు. విడాకుల పిటిషన్ అయితే వెనక్కి తీసుకున్నారు కానీ, ఉపసంహరణకు గల నిర్దిష్ట కారణాలను ఆమె వెల్లడించలేదు.