బావిలో అలలు.. బుడగలు
- భూప్రకంపనలేమోనని గ్రామస్తుల ఆందోళన
- గుజరాత్‌లోని మోర్బీలో అరుదైన ఘటన
- శాస్త్రవేత్తలతో సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం
- అడుగు నుంచి గాలి బయటకు రావడమే అలలకు కారణం
గాంధీనగర్, ఆగస్టు ౭: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని ఓ బావిలో నీరు అలలు అలలుగా ఎగసిపడటం గ్రామస్తులను కలవరపెట్టింది. నీటి అలజడి భూప్రకంపనలేమోనని, భూకంపానికి ముందు వచ్చే సంకేతమనుకుని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. బావిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ప్రస్తుతం బావికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో కలెక్టర్ స్వప్నిల్ ఖరే స్పందించారు. గాంధీనగర్ నుంచి ఒక శాస్త్రవేత్తల బృందాన్ని గ్రామానికి పంపించారు. ఆ బృందం బావి వద్ద పరిశోధించి, బావి నుంచి వచ్చే ప్రకంపనలు భూపక్రంపనలు కావని తేల్చిచెప్పింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో భారీగా భూగర్భ జలాలు ఊరుతున్నాయని, ఈ క్రమంలో బావిలోని రాళ్ల రంధ్రాల నుంచి గాలి ఉత్పన్నమై అలలుగా ఏర్పడి, బుడగలుగా పైకి వస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఎలాంటి ప్రమాదమూ లేదని బృందం చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.






