29 August, 2026 | 4:39 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభానికి సన్నాహాలు

29-08-2026 12:34 AM

సంబంధిత ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో ఆనంద్ తనిఖీలు

మేడ్చల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభానికి సంబంధించి ఆసుపత్రుల్లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. ఆనంద్ పరిశీలించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు సులభంగా అందేలా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.

కూకట్పల్లిలోని రెమెడీ,  బీబీఆర్, మెడిసిటీ ఆసుపత్రిలను సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు, సమాచారవిద్యప్రచార సామగ్రిని పరిశీలించారు. పథకానికి సంబంధించిన సమాచారం లబ్ధిదారులకు స్పష్టంగా అర్థమయ్యేలా ఏర్పాటు చేసిన విధానాన్ని సమీక్షించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు పథకం ద్వారా అందుబాటులో ఉండే వైద్య సేవలు, చికిత్సా సౌకర్యాలు, నగదు రహిత వైద్య సేవలపై పూర్తి అవగాహన కల్పించాలని డా. కె. ఆనంద్ సూచించారు.

ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పథకం ప్రారంభం అనంతరం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రావాలన్నదే ప్రధాన లక్ష్యమని డా. కె. ఆనంద్ పేర్కొన్నారు.