25 July, 2026 | 11:06 AM

గొర్రెల కొట్టంగా ప్రభుత్వ గిడ్డంగి!..

25-07-2026 09:55 AM

పదేళ్లుగా ప్రైవేటుపరం..

నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండల కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ గోదాం(Government warehouse) ప్రైవేటు వ్యక్తి వినియోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నిర్మించిన సివిల్ సప్లై గిడ్డంగి పది సంవత్సరాలుగా ఓ వ్యక్తి గొర్రెలకు షెడ్డుగా వినియోగిస్తున్నారు.ఈ గిడ్డంగి ప్రాంగణంలో గొర్రెల పెంపకంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపిన సమాచారం.

ఈ విషయమై స్థానికులు సదరు వ్యక్తిని నిలదీయగా ప్రతి దసరా,సంక్రాంతి పండుగలకు అధికారులకు యాటలు (మేకలు, గొర్రెలు) ఇస్తున్నామని బదులివ్వడం గమనార్హం.అధికారుల అండదండలతోనే ఈ తంతు నిర్భయంగా నడుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి వెంటనే సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవాలని నంగునూరు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లైస్  జిల్లా మేనేజర్  గోపి కృష్ణను వివరణ కోరగా.త్వరలో విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామనీ తెలిపారు.ప్రభుత్వ భూమిని,ఆస్తులను కబ్జాలు చేస్తే నేరం అవుతుందన్నారు.