25 July, 2026 | 10:26 AM

అటవీ శాఖ యూటర్న్.. లొద్ది మల్లయ్య జాతరకు గ్రీన్ సిగ్నల్

25-07-2026 09:53 AM
  1. ఉదయం నిషేధం.. సాయంత్రం అనుమతి
  2. ఏకాదశి రోజున ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు దర్శనానికి అవకాశం
  3. తొలి ప్రకటనపై భక్తుల్లో అయోమయం.. తాజా నిర్ణయంతో ఊరట

అచ్చంపేట: నల్లమల అడవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం కోర్ ఏరియాలో వెలసిన ప్రసిద్ధ లొద్ది మల్లయ్య స్వామి(Lodhi Mallayya Temple) జాతర నిర్వహణ విషయంలో అటవీ శాఖ ఒకే రోజులో యూటర్న్ తీసుకుంది. శుక్రవారం ఉదయం జాతరకు అనుమతి లేదని స్పష్టం చేసిన అధికారులు, సాయంత్రానికి నిర్ణయాన్ని మార్చి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

మొదట విడుదల చేసిన ప్రకటనలో లొద్ది మల్లయ్య క్షేత్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో(Amrabad Tiger Reserve Core Area) ఉండటంతో వన్యప్రాణుల సంరక్షణ, ముఖ్యంగా పులులు, ఇతర అడవి జంతువుల సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జాతరకు అనుమతి ఇవ్వడం లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అడవిలోకి ప్రవేశిస్తే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

అయితే అదే రోజు సాయంత్రం మరో ప్రకటన విడుదల చేసిన అటవీ శాఖ అధికారులు తమ నిర్ణయాన్ని సవరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులు లొద్ది మల్లయ్య స్వామిని దర్శించుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నిర్ణీత సమయాల్లో మాత్రమే భక్తులు ఆలయాన్ని సందర్శించాలని, అటవీ శాఖ సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఉదయం అనుమతి నిరాకరణ ప్రకటనతో భక్తుల్లో తీవ్ర అయోమయం నెలకొనగా, సాయంత్రం వెలువడిన తాజా ప్రకటనతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకే రోజులో అటవీ శాఖ రెండు భిన్నమైన ప్రకటనలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. భక్తుల విజ్ఞప్తులు, ప్రజాప్రతినిధుల వినతులు లేదా ఇతర పరిపాలనా కారణాల వల్లే నిర్ణయం మారిందా అనే అంశంపై అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శనివారం జరిగే దర్శన ఏర్పాట్ల నేపథ్యంలో భక్తులు అటవీ శాఖ నిబంధనలను పాటిస్తూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.