పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను తప్ప ఎవరిని రానివ్వద్దు..
పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను తప్ప ఎవరిని రానివ్వొద్దని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి తెలిపారు. మంగళవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో జరిగానున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సమావేశం నిర్వహించారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల పనితీరు ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఒకరి తరువాత ఒకరు ఓటు వేసే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బుధవారం జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 170 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఏసిపి జి.కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్సై చంద్రకుమార్ తో పాటు పలువురు ఎస్సైలు, పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




