24 April, 2026 | 1:51 AM

లింగ నిర్ధారణ చట్టం అమల్లో రాజీపడొద్దు

24-04-2026 12:00 AM

కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ): లింగ నిర్ధారణ చట్టం (పీసీపీఎన్డిటి) అమలులో రాజీ పడొద్దని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కొత్తగా ఏర్పాటవుతున్న క్లినిక్లు, ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల అనుమతి దరఖాస్తులను సమీక్షించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 ప్రైవేట్ క్లినిక్లు, 3 స్కానింగ్ సెంటర్ల దరఖాస్తులను పరిశీలించి, చట్టపరమైన నిబంధనలు పూర్తిచేసిన వాటికి మాత్రమే అనుమతులివ్వాలని తెలిపారు. బాలికలపై వివక్షను నివారించడమే ఈ చట్టం లక్ష్యమని పేర్కొంటూ, లింగ నిర్ధారణకు సంబంధించిన ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ రవికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.