ఆశవర్కర్లకు పరీక్షలు నిర్వహించొద్దు
సీఎం రేవంత్ రెడ్డికి తమ్మినేని లేఖ
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఆశ వర్కర్లకు పరీక్షలు నిర్వహించొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సర్క్యులర్ ప్రకారం పరీక్ష నిర్వహించబోతున్నట్లు యంత్రాంగం చెబుతున్నప్పటికీ, పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆశ వర్కర్లు అభద్రతా భావానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకే పరీక్ష.. అని అధికారులు చెబుతున్నారని, నైపుణ్యాల ను పెంపొందించేందుకు శిక్షణ ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆశ వర్కర్లు ప్రజారోగ్య సంరక్షణ కోసం ముందు వరుసలో ఉండి సేవలందించారని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిని ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’గా అభివర్ణించిన సంగతిని గుర్తుచేసుకోవాలన్నారు. వారు దశాబ్దాల నుంచి ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం వారికి పరీక్ష నిర్వహించలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం కూడా అలాగే చేస్తే బాగుంటుందన్నారు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలని, వారికి బీమా సౌకర్యం కల్పిం చాలని డిమాండ్ చేశారు.






