6 May, 2026 | 4:17 AM

అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు

06-05-2026 02:55 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

కూకట్‌పల్లి, మే 5 (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో.. పేదల పొట్టకొటొద్దని, గౌరవప్రదమైన అభివృద్ధి జరగాలి అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం రోజు స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే భరత్‌నగర్ కాలనీలో పర్యటించిన రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు పేరుతో నిరుపేదల జీవనాధారాలను ఏకపక్షంగా తొలగించవద్దని అధికారులను ఆదేశించారు.

నిరుపేదల దుకాణాలను తొలగించే ముందు వారికి ప్రత్యామ్నాయంగా  వేరేచోట వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించి అప్పుడే దుకాణాలు తొలగించాలని అధికారులకు సూచించారు. తెల్లవారుగానే జెసిబి లు పెట్టి రోడ్ల పక్కన ఉన్న చిరు వ్యాపారాలు షెడ్లు, తోపుడు బండ్లు కూల్చివేయడం సరికాదు అని అధికారులకు స్పష్టం చేశారు.

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. సమీపంలోని వెండింగ్ జోన్ లేదా, మార్కెట్ సమీపంలో పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పండాల సతీష్ గౌడ్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.