ఆ ఇండ్లను ఖాళీ చేయించొద్దు
- రెవెన్యూ అధికారులు స్పందించేదాకా చర్యలు వద్దు
- వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): వరంగల్ దేశాయ్‌పేటలోని 13వ డివిజన్లో బీపీఎల్ పథకం కింద పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో షరతులకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే రెవెన్యూ శాఖ స్పందించాల్సిఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అసైన్డ్ పట్టాలను రద్దు చేసి స్థలాలను స్వాధీనం చేసుకునేదాకా వాటిని ఖాళీ చేయించరాదంటూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా చిన్నవాడపల్లి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు సంబంధించి అందరికీ నోటీసులు జారీచేయాలని, వారి వివరణ తీసుకున్నాక చట్టప్రకారం ముందుకెళ్లాలని వరంగల్ మున్సిపల్ అధికారులకు సూచించింది.
చిన్నవాడపల్లి చెరువు బఫర్‌జోన్, ఎఫ్‌టీపీల్లో నిర్మాణాలున్నాయని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జూలై 25న ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ దేశాయ్‌పేట 13వ డివిజన్‌కు చెందిన ఆర్ కొమురమ్మ మరో 126 మంది పేదలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీపీఎల్ పథకం కింద ప్రభుత్వం 2007 నుంచి 2023 మధ్య కాలంలో పేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు. ఇక్కడ 30 నుంచి 60 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారని, ఆస్తిపన్నుతోపాటు విద్యుత చార్జీలు కూడా చెల్లిస్తున్నారని చెప్పారు.
సమగ్ర సర్వే చేయకుండా, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను నిర్దారించకుండా ఖాళీ చేయిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చెరువుల్లో ఆక్రమణలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని, ఇందులో భాగంగా చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్నారని చెప్పారు.
చిన్నవాడపల్లి చెరువులో 329 గుడిసెలున్నాయని, నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్టాలు జారీచేశారని, వారి షరతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే వారే చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. అసైన్డ్ పట్టాలను రద్దు చేసేదాకా ఆ ఇళ్లను ఖాళీ చేయించొద్దని, అదేవిధంగా దీనిపై అందరికీ నోటీసులు జారీచేసి వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు. ఇదే చెరువుపై మరికొందరు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారించిన హైకోర్టు కలెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చుతూ వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.






