పోడు రైతులకు హానీ తలపెట్టొద్దు
- రైతుల హక్కులను కాపాడుతూ అడవులను పరిరక్షించాలి
వ్యవసాయం పేరుతో భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
అటవీ అధికారులపై దాడులకు పాల్పడితే సహించేది లేదు
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరిక
పోడు, అటవీ భూములపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ‘పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకూడదు. వారి ఉపాధికి భంగం కలగకూడదు. అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయండి’ అంటూ మంత్రి కొండా సురేఖ అధికారులకు గీతోపదేశం చేశారు. పోడు రైతు కుటుంబాలు కూడా అటవీ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని హితవు పలికా రు. పోడు భూముల సమస్యలపై మంత్రి సురేఖ శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పోడు రైతుల హక్కులను కాపాడటంలోనూ, అటవీశాఖ అధికా రులకు ప్రభుత్వం రక్షణ కల్పించడంలో సమన్వయంతో ముందుకు సాగుతున్నామ న్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్‌ఆర్‌ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు.
బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూములు
బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపులపై నివేదికను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాకాలం సమీస్తున్నందున పోడు భూముల సమస్యలకు పరిష్కారం వెతకాలని సూచించారు. అటవీశాఖ, రైతుల మధ్య జరుగుతున్న సంఘర్షణల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
సమన్వయంతో వ్యవహారించాలి
పోడు రైతుల విషయంలో అటవీశాఖ అధికారుల సమన్వయంతో వ్యవహారించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. అటవీ భూములను కాపాడుకుంటూనే పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టి.. వారికి ప్రయోజనం కలిగించాలన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నామని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ది పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా, ఏళ్లుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ది పనులు కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను సీతక్క కోరారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని, అందుకు కేంద్ర ప్రభుత్వంతో పోడు భూముల సమస్యను చర్చించి పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రి సీతక్క కోరారు. పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్టను సాగు చేయడంతో పోడు రైతులకు ప్రయోజనాలు కలిగిస్తూనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన గిరిజనులు మన రాష్ట్రానికి వస్తే.. ఇక్కడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని, భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మార్గదర్శకాలను రూపొందించాలన్నారు.
మాకు రక్షణ కల్పించండి : మంత్రికి ఫారెస్ట్ అధికారుల సంఘం వినతి
అటవీ భూముల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు భరోసా కల్పించి ఆదుకోవాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి కొండా సురేఖకు సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ స్పందిస్తూ అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి ఏ సాయం కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగేందర్‌బాబు, ఉపాధ్యక్షులు సాంబు, కార్యదర్శి ప్రశాంత్, కోటేశ్వర్‌రావు తదితరులున్నారు.
పచ్చదనం పెంపుపై మంత్రి సురేఖ సూచనలు
- రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపుదలలో భాగంగా అన్ని రకాల మొక్కలు నాటాలి. అందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖతో చర్చించాలి
- వేప, బొడ్డు మల్లే, గంగరేగు, కుంకుడు, చీమ చింతకాయ, సీతాఫలం, రావి వంటి చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ చెట్లు నీడను ఇవ్వడంతో పాటు అటవీ జంతువుల అవసరాలు తీర్చే మొక్కలను ఎక్కువగా నాటాలి
- వేగంగా పెరిగే మొక్కలను నాటాని, చెట్లు విస్తరిస్తూ కరెంట్ తీగలకు తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.
- అటవీశాఖ నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలన్నింటిని నాటాలి . బయట నుంచి మొక్కలు కొనకుండా.. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న అన్ని శాఖలకు సర్క్యలర్ జారీ చేయాలి.
- గతంలో మొక్కలు నాటేందుకు ట్రాక్టర్లతో గుంతలు తీసినందున చాలా వరకు మొక్కలు విస్తరించలేదు. ఇప్పుడు మానవ ప్రమేయంతో తీసిన గుంతల్లోనే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలి.






