మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు
- శాంతి సామరస్యాలతో మెలగాలి
- చట్టాలు ఉల్లంఘించే వారిపై నిఘా
- మల్టీజోన్ ఐజీ రంగనాథ్
మెదక్, జూన్ 16 (విజయక్రాంతి): మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై పోలీస్ నిఘా ఉంటుందని, ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా ప్రవర్తించినా, చట్టాలను ఉల్లంఘించినా చర్యలు తప్పవని మల్టీజోన్ ఐజీ రంగనాథ్ సున్నితంగా హెచ్చరించారు. శనివారం రాత్రి మెదక్‌లో ఇరువర్గాల ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘర్షణకు కారణమైన మొత్తం 45 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వీరిలో ఒక వర్గానికి చెందిన వారు 22 మంది, మరో వర్గానికి చెందిన వారు 23 మంది ఉన్నారన్నారు.
వారందరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. సమాజంలో అన్నివర్గాల వారు శాంతి సామరస్యాలతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, వివిధ వర్గాల నాయకులు గడ్డం కాశీనాథ్, మైనార్టీ నాయకులు ఖాజా మొహినుద్దీన్, జావేద్ మౌలానా, భారత్ ఆరీఫ్, హఫీజ్, అంజద్, అఫ్జల్, అహ్మద్ బేగ్, షాహెద్ అలీ పాల్గొన్నారు.






