మోతాదుకు మించి యూరియా వాడొద్దు
- రైతులకు తోర్నల శాస్త్రవేత్తల సూచనలు
గజ్వేల్: మోతాదుకు మించి యూరియా వాడొద్దని తొర్నాల వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. గజ్వేల్ మండల రైతు వేదికలో శనివారం వ్యవసాయ పాలిటెక్నిక్ తోర్నాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో “రైతు ముంగిట శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు.
పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల రైతులకు లాభాలు చేకూరుతాయని, పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు సంబంధించిన పెట్టుబడి రసీదులను భద్రపరచుకోవాలని సూచించారు. తద్వారా నష్టపరిహారం పొందడం సులభమవుతుందన్నారు. వేసవి దుక్కుల ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యం, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తీరణ అధికారి గణేష్‌తో పాటు పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు






