calender_icon.png 4 February, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగుల ప్రాణాలతో వైద్యుల చెలగాటం!

04-02-2026 01:45:25 AM

  1. ఆస్పత్రులపై కొరవడిన పర్యవేక్షణ

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు దొందు... దొందే...

ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం 

భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): అనారోగ్య బారిన పడితే ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాము అనే నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు జిల్లాలో ఎక్కడో అక్కడ వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ప్రాణాలు వదులుతున్నట్లు, సైడ్ ఎఫెకట్స్ కు గురవుతున్నట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. వైద్యులు మోతాదుకు మించి హైడోస్ మెడిసిన్ ఉపయోగించడం వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పాల్వంచ పట్టణంలో తాజాగా వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలయింది. వివరాల్లోకి వెళితే పట్టణ పరిధిలోని కేటీపీఎస్ లో ఆర్టిజన్ ఉద్యోగ పనిచేస్తున్న అనపర్తి నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి మృతి చెందాడు. నాగేశ్వరరావు కాళ్లకు బొబ్బలు వచ్చాయంటూ చికిత్స కోసం పాల్వంచలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు.

సదరు ఆ డాక్టర్ తాను ఎమ్మెస్ సర్జన్ గా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేసుకుని జనరల్ ట్రీట్మెంట్ చేయటం గమనారహం. వచ్చిన రోగికి మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ (హైడోస్) ఇచ్చారని, ఆ కారణంగానే నాగేశ్వరరావు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఆస్పత్రిలో గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయనీ తెలుస్తోంది. ఇటీవల పాల్వంచలోని విజయ నర్సింగ్ హోమ్ లో  నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డ మృతి చెందిన సంఘటన ప్రజలు మరువకముందే మరో ప్రైవేట్ ఆసుపత్రిలో హైడోస్ కారణంగా కేటీపీఎస్ ఉద్యోగి మృత్యువాత పడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనూ హైడోస్...

ప్రవేట్ ఆసుపత్రులకు తామేమి తీసిపోము అన్నట్లుగా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సైతం వ్యవహరిస్తున్నారు. పాత పాల్వంచకు చెందిన 16 సంవత్సరాల వీరభద్ర రాజు అనే అతను జనవరి 26న జ్వరం వస్తుందని పాల్వంచ సిహెచ్ సి లో చేరారు. రక్త పరీక్ష చేసిన వైద్యులు చికిత్సను అందించారు. రెండవ రోజు ఆ బాలుడి శరీరం మొత్తం బొబ్బలు రావడంతో వైద్యులు రోగికి అమ్మతల్లి (మసూచి) సోకిందని తల్లిదండ్రులతో సంతకం చేయించి డిశ్చార్జ్ చేశారు.

శరీరం మంటలు రావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలో చేరారు రోగిని పరీక్షించిన వైద్యులు శరీరం ఇన్ఫెక్షన్ అయింది అంటూ కొత్తగూడెం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈనెల 1వ తేదీన కొత్తగూడెంలోని శ్రీ ఉష ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి కుడి కన్ను కోల్పోవడం, శరీరం మొత్తం ఊడిపోవటం జరుగుతుంది.

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మోతాదుకు మించి హైడోస్ ఇవ్వడం వలన తమ కుమారుడికి ఈ పరిస్థితి ఏర్పడిందని తండ్రి సీతారామరాజు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెంలోని శ్రీ ఉష ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనలు వైద్యుల నిర్లక్ష్యాన్ని తేట తెల్లం చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల అందిస్తున్న చికిత్సపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.