వైద్యులారా.. మీ బాగూ ముఖ్యమే!
భూమి ఆవిర్భవించి 450 కోట్ల ఏళ్లు పూర్తయినా, ప్రైమేట్స్ పరిణామక్రమం ప్రారంభమై దాదాపు 70 లక్షల సంవత్సరాలైనా మానవ శరీరం ఇప్పటికీ మానవ మేధస్సును ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే సమయంలో ఎన్నో సవాళ్లను కూడా విసురుతున్నది. వైద్యశాస్త్రం నిరంతరం అభివృద్ధి చెందుతూ, వేగంగా విస్తరిస్తూ, రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నది. కొన్నిసార్లు అది రాకెట్ సైన్స్ కంటే క్లిష్టంగా అనిపిస్తుంది. సమాచారం విస్తారంగా అందుబాటులోకి వచ్చిన ఈ యుగంలో విద్యా పరిశోధనలు ఎంతో ముందుకెళ్లినప్పటికీ, మానవ శరీరంలోని అనేక రహస్యాల గురించి వైద్యులకు కూడా స్పష్టమైన అవగాహన లేదు.
వైద్యశాస్త్ర చరిత్రను పరిశీలిస్తే ప్రాచీ న కాలంలో చికిత్సను ఒక కళగా భావించేవారు. అప్పట్లో మత విశ్వాసాలు, వైద్య విధానాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేవి. భారతదేశంలో వైద్య చికిత్స వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వర కు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలు అనేక దశ ల్లో అభివృద్ధి చెందాయి. శాస్త్రీయ పరిజ్ఞానం వైద్యానికి పునాదిగా మారకముందు దుష్టశక్తులు, దేవతల ఆగ్రహం లేదా గ్రహాలు, నక్షత్రాల ప్రభా వం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని ప్రజలు నమ్మేవారు. అందువల్ల ప్రార్థనలు, పూజలు వంటి ఆచారాలను చికిత్సలో భాగంగా అనుసరించేవారు.
అయితే, ఒక కళగా ఉన్న చికిత్స క్రమం గా శాస్త్రంగా రూపాంతరం చెందింది. అనంతరం అది ఆధునిక వైద్యశాస్త్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వైద్యరంగం సేవతో పాటు ఒక పరిశ్రమగా కూడా ఎదిగింది. భారత్‌లో వైద్య విజ్ఞానాభివృద్ధికి ఆత్రేయు డు, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, మా ధవాచార్యుడు వంటి మహనీయులు విశేష కృషి చేశారు. అయితే, గ్రీస్‌కు చెందిన హి ప్పోక్రటీస్ ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడిగా పేరుపొందారు. క్రీస్తుపూర్వం 370 ప్రాంతానికి చెందిన ఆయన వైద్యాన్ని శాస్త్రీ య దృక్పథంతో అభివృద్ధి చేయడంలో ఎనలేని కృషి చేశారు. ఆసుపత్రుల అభివృద్ధి కూడా వైద్య చరిత్రలో ఒక కీలక ఘట్టమని చెప్పాలి.
ప్రాచీన గ్రీస్‌లో తొలి ఆసుపత్రి ఏర్పాటవగా, అనంతరం రోమ్, భారత్, పర్షియా, చైనా, జపాన్, కొరియా దేశాల్లో వైద్యశాలలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఆసుపత్రి క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో శ్రీలంకలో స్థాపించిన ట్టు చెబుతారు. భారత్‌లో ఆధునిక వైద్యశాస్త్రాన్ని ఆచరించిన తొలి వైద్యుల్లో కోల్‌క తాకు చెందిన మధుసూదన్ గుప్తా ఒకరు. కాగా, పాశ్చాత్య వైద్య విద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళా డాక్టర్ ఆనందీబాయి జోషి. ముంబైకి చెందిన ఆమె కొద్ది నెలలే వైద్య సేవలందించి, క్షయవ్యాధితో 22 ఏళ్ల వయసులోనే మరణించారు.
వైద్యుల దినోత్సవం: భారత్‌లో ఏటా జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తా రు. వైద్య వృత్తిని, ఆ రంగం సాధించిన పురోగతిని గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్స వాన్ని జరుపుకొంటారు. జూలై 1కి ఒక ప్రత్యేకత ఉంది. ప్రముఖ వైద్యుడు బిధాన్ చంద్రరాయ్ జన్మదినం, వర్ధంతి ఇదే రోజు కావడం గమనార్హం. కోల్‌కతాకు చెందిన ఆయన వైద్యుడిగా సేవలందించడమే కాకుండా పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.
విప్లవాత్మక మార్పులు: గత కొన్ని దశాబ్దాలుగా ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మా ర్పులు జరిగాయి. వైద్య పరిశోధనల్లో వేగ వంతమైన పురోగతి, ఎప్పటినుంచో పీడిస్తున్న వ్యాధులకు ఔషధాల అభివృద్ధి, ఆధు నిక నిర్ధారణ పరికరాల అందుబాటు వల్ల వైద్య సేవలు మరింత కచ్చితమైనవిగా, సమర్థవంతమైనవిగా మారాయి. నేడు టెలిమెడిసిన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, యాప్‌లు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఏఐ ఆధారిత వైద్య సమాచారం వంటి సాంకేతికతలు అత్యంత మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరవేస్తున్నాయి. అవయవ మార్పిడి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, అత్యాధునిక చికిత్సా విధానాలు మనుషుల జీవి తకాలాన్ని పెంచడమే కాకుండా, ఆ జీవితానికి మెరుగైన నాణ్యతను కూడా అందిస్తు న్నాయి. ఈ పరిణామాలన్నీ వ్యాధుల నివారణ, నిర్ధారణ, చికిత్స విధానాల్లో సమూల మార్పులకు దారితీశాయి.
భారత్‌లో పెరుగుతున్న ముప్పు: భారతదేశం గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధు ల భారాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నది. జన్యుపరమైన, జీవక్రియలకు సంబంధించిన అనేక కారణాల వల్ల భారతీయుల్లో గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతీయుల ధమనులు ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే చిన్నవిగా ఉండటం వల్ల అవి సులభంగా మూసుకుపోయే ప్రమాదం ఉంది. మన ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో ఉదర భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. శరీరంలో అధిక కొవ్వు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మధుమేహం, జీవక్రియలలో లోపాలు వంటివి ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
భారతీయుల్లో రక్తంలోని కొవ్వు పదార్థాల స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్వల్పంగా పెరిగినా ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె జబ్బులకు కారణమయ్యే లైపోప్రొటీన్ (ఎ) అనే కొవ్వు కణం కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్లే గుండె వ్యాధులు భారత్‌లో మహమ్మారి స్థాయికి చేరుకున్నాయి.
చిన్న వయసులోనే మరణిస్తున్న వైద్యు లు: నేడు వైద్యులు అత్యంత ఒత్తిడిలో జీవిస్తున్నారు. సుదీర్ఘ పని గంటలు, రాత్రి విధు లు, అత్యవసర పిలుపులు వైద్యులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. కేరళలో వైద్యులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారతీయ వైద్యులు సాధారణ ప్రజలతో పోలిస్తే సగటున 10 నుంచి 13 ఏళ్ల ముందుగానే మరణిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు వెల్లడయ్యాయి. భారతీయ వైద్యుల్లో అత్యధిక మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే కారణం. ఆ తర్వాతి స్థానంలో క్షయ, కరోనా, హైపటైటిస్ సి వంటి వ్యాధులు ఉన్నాయి.
సాధారణ ప్రజలతో పోలిస్తే భారతీయ వైద్యుల్లో క్యాన్సర్, ముఖ్యంగా మెదడు క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌పై అవగాహన ఉన్నప్పటికీ, దాన్ని నివారించే చర్యలను పాటిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. వృత్తిపరమైన ఒత్తి డి, అలసట వల్ల వైద్యులు, వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
భారతీయ వైద్యులు తీవ్ర పనిభారం కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. దీర్ఘకా లిక మానసిక ఒత్తిడి శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తున్నది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్నది. కాలక్రమేణా ఇవి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలామంది వైద్యులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా రు. వ్యాయామం చేయడం, ముందస్తు ఆరో గ్య పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటి విషయాలను విస్మరిస్తున్నారు.
పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడి వైద్యులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. అందువల్ల సాధార ణ ప్రజలతో పోలిస్తే అక్కడి వైద్యుల ఆయుర్దాయం ఎక్కువ.
స్వీయ రక్షణ నివారణ: ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మన ఆరో గ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులమైన మనపై ఉంది. తమ ఆరోగ్యా న్ని కాపాడుకునే వైద్యులే ఇతరుల ఆరోగ్యా న్ని సమర్థంగా సంరక్షించగలరు. అందువల్ల ప్రతి వైద్యుడు నివారణ, రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా రేడియాలజిస్టులు తగిన రక్షణ చర్యలు తీసుకోవడం తో పాటు, తరచూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరూ తమ ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను.
తప్పనిసరిగా పాటించాల్సినవి: నడక, యోగా లాంటి వ్యాయామాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. అంతే కాకుండా కొవ్వు, పిండిపదార్థాలు అధికంగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌ను తగ్గించాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు ఆరోగ్యకరమైన శరీర బరువును కూడా కాపాడుకోవాలి.
జీవన నాణ్యత: వృత్తిపరమైన బాధ్యతలతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కొంత సమయం గడపాలి. ఆటలు, ఈత, సంగీతం లేదా ఇతర ఏదైనా అభిరుచికి సమయం కేటాయించాలి. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత అవసరం. అమెరికా, యూకేతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయ వైద్యులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కృషి, అంకితభావం, నిబద్ధతకు ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవం ఉంది. తమ జీవితాలను ఇతరుల ఆరోగ్యానికి అంకితం చేసిన భారతీయ వైద్యులందరికీ వైద్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక వందనాలు.
వ్యాసకర్త: ప్రొఫెసర్, ప్రముఖ వైద్యులు, కామినేని హాస్పిటల్స్






