ఉత్తమ లేఖ.. చాణక్యుని దృష్టి
పాలకుర్తి రామమూర్తి :
నిందా ప్రశంసా పృఛ్ఛాచ
తథాఖ్యానమథార్థనా
ప్రత్యాఖ్యాన ముపాలంభః
ప్రతిషేధో౨థ చోదనా
సాంత్వమభ్యవపత్తిశ్చ భర్త్సనానునయౌ తథా
ఏతేష్వర్థాః ప్రవర్తంతే త్రయోదశ
సులేఖజాః!
(కౌటిలీయం-2-10)
మానవ సంబంధాలను ప్రభావవంతంగా నిర్మించుకునే సాధనాలలో లేఖకు విశిష్టమైన స్థానం ఉంది. లేఖ అనేది తరతరాలుగా వ్యక్తుల మధ్య భావనలను, బాధ్యతలను, విలువలను పం చుకునే వారధిగా చెప్పుకోవాలి. అలాంటి లేఖలో ప్రతిబింబించే పదమూడు విషయాలను చెబుతున్నాడు, ఆచార్య చాణక్య. ప్రతి లేఖలో ఈ పదమూడు అంశాలు తప్పనిసరి గా ఉండాలని కాదు. సందర్భాన్ని బట్టి వీటి లో ఏదో ఒకటి లేదా అనేక అంశాలు ఉండవచ్చు.
నింద, ప్రశంస, పృఛ్ఛ, ఆఖ్యానం, అర్థ న, ప్రత్యాఖ్యానం, ఉపాలంభం, ప్రతిషేధం, చోదన, సాంత్వం, అభ్యవపత్తి, భర్త్సనం, అనునయం ఈ పదమూడు అంశాలను లేఖలో ప్రస్తావించవచ్చు. సాధారణంగా ఇవి పాలకులు, అధికారులు, మంత్రులు, మిత్రు లు, బంధువుల మధ్య జరిగే అధికారిక, వ్యక్తిగత లేఖలలో ఉపయోగించే భావ ప్రకటనలుగా చూడాలి.
వ్యక్తికి లేదా బాధ్యతా నిర్వహణ లేదా పనులకు సంబంధించిన దోషాలను ఉటంకించడం ‘నింద’. దీనిని కేవలం దూషణగా భావించరాదు, పరిపాలనలో తప్పులను ఎత్తిచూపడంగా కూడా భావించవచ్చు. వ్యక్తిలోని ఉత్తమ గుణాలను వర్ణించడం ‘ప్రశంస’. నిజానికిది రాజనీతిలో ప్రేరణనిచ్చే అంశంగా భావించాలి. ఒక విషయాన్ని ‘ఇది ఎలాగా’ అంటూ ప్రశ్నించడం ‘పృఛ్చ’. ఇందులో సమాచారాన్ని, వివరణలను, నివేదికలను కోరడం, సందేహాలను అడగడం కూడా వస్తాయి.
ప్రశ్నకు సమాధానంగా ‘ఇది ఇలా గా’ అని చెప్పడం లేదా నివేదికలను సమర్పించడం ‘ఆఖ్యానం’. ఏదైనా ఇతరుల నుం చి కావాలని కోరడం... అది సహాయం కావ చ్చు, రక్షణ కావచ్చు, పదవులు కావచ్చు అనుమతులూ కావచ్చు... ఇవేవైనా ‘అర్థన’ లే. ‘ఇవ్వను’ అని చెప్పి తిరస్కరించడం ‘ప్రత్యాఖ్యానం’. ఇది ‘ఇలా చేయడం’ నీకు తగ దని బాధ్యతాయుతంగా హెచ్చరించడం ‘ఉపాలంభం’. కాగా ‘ఇలా చేయవద్దు’ అని నిషే ధించడం ‘ప్రతిషేధం’.
‘ఇది ఇలా చేయి’ అం టూ ఆజ్ఞాపించడం లేదా ఉత్సాహపరచడం లేదా ప్రేరణనివ్వడం ‘చోదన’. ఎదుటి వ్యక్తి తో ‘నా ద్రవ్యం అంతా నీదే’ నేను, పరివారమంతా నీ పక్షానే ఉన్నాము అంటూ ధైర్యా న్ని కలిగిస్తూ అనుకూలంగా మాట్లాడడం ‘సాంత్వం’ కాగా కష్టాలలో సహాయపడడం, బాధ్యతను స్వీకరించడం, సహాయానికి ముం దుకు రావడం ‘అభ్యవపత్తి’. జాగ్రత్తగా లేకపోతే ఈ విధంగా శిక్షిస్తాను అంటూ హెచ్చ రించడం, కఠినంగా మందలించడం ‘భర్త్స నం’. చివరగా ‘అనునయించడం’ అంటే ఓదార్పు.
ఈ ఓదార్పు మూడు విధాలు. ‘తనకవసరమైన ఏదైనా పనిని చేసిపెట్టమని బతిమిలాడడం’... ‘తనవల్ల అపరాధం జరిగిన సమయంలో మన్నించమని కోరడం’... ఆప్తులకు కష్టం కలిగినవేళ వారిని ‘ఓదార్చడం’. ఒక విధంగా ఇది ఎదుటివారి మనసును గెలుచుకునే వినయపూర్వక ప్రయ త్నంగా భావించవచ్చు.
లోతుగా ఆలోచిస్తే చాణక్య ఈ పదమూ డు అంశాలను యాదృచ్చికంగా కాకుండా హేతుబద్ధంగా నిర్దిష్టమైన క్రమంలో ప్రతిపాదించాడు. మానవ సంబంధాల ఉన్నతీకర ణలో భాగంగా.. నింద, ప్రశంసల ద్వారా వ్యక్తిని అంచనావేయడం... ప్రశ్న, సమాధానాల ద్వారా సంభాషణను కొనసాగిం చడం... కోరడం, తిరస్కరించడం ద్వారా అభ్యర్థనలు చేయడం.. ఉపాలంభం, నిషేధం, ఆదేశాల ద్వారా పరిస్థితులను సరిచేయడం... సాంత్వం, సహాయం ద్వారా సం బంధాలను పరిరక్షించడం... భర్త్సనం, అనునయాల ద్వారా క్రమశిక్షణాయుత వాతావ రణాన్ని పాదుకొల్పడం చాణక్య ఉద్దేశంగా భావించాలి.
ఈనాటి పాలనా వ్యవస్థలో కూడా ఈ పదమూడు అంశాలు ప్రభుత్వ లేఖలలో ప్రతిబింబిస్తాయి. లేఖలను సమాచార మార్పిడికి సాధనాలుగానే కాకుండా విమర్శ, ప్రశంస, విచారణ, ఆదేశం, నిషేధం, సహాయం, శిక్షణ, సమన్వయం వంటి మాన వ సంబంధాలను ప్రతిబింబించే సమగ్ర పరిపాలనా సాధనాలుగా చాణక్య భావించాడని స్పష్టమవుతుంది.
ఒకప్పుడొక రాజు సరిహద్దు ప్రాంతంలో ని పరిస్థితులను సమీక్షిస్తూ తన సేనాధిపతికి లేఖను రాశాడు... మీరు ఈమధ్య చూపుతు న్న అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా సరిహద్దు ప్రాంతంలో శత్రువుల చర్యలు రాజ్యానికి హానికరంగా పరిణమిస్తున్నాయి (నింద). అయితే గత కాలంలో యుద్ధ సమయాలలో అప్రమత్తతతో, మీరు చూపిన పరాక్రమం ప్రశంసనీయాలు (ప్రశంస). ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో వెంటనే తెలియజేయండి (పృఛ్చ).
దానికి సమాధానంగా సైన్యాధికారి ఇలా రాశా డు... రాజ్య సరిహద్దు అలజడులకు సంబంధించిన సమగ్ర నివేదికను పంపుతున్నాను (ఆఖ్యానం). అవసర మైన అదనపు సైన్యాన్ని పంపవలెనని కోరుతున్నాను (అర్థన). దానికి రాజు.. ప్రస్తుతం అదనపు సైన్యాన్ని పంపడం సాధ్యం కాదు (ప్రత్యాఖ్యానం). అంతేకాదు, భవిష్యత్తులో ఇటువంటి నిర్లక్ష్యం నీ స్థాయికి తగదు (ఉపాలంభం). ఇకపై సరిహద్దు రక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దు (ప్రతిషేధం).
అందుబాటులో ఉన్న సైనికులను పునర్వ్యవస్థీకరించి తత్ క్షణమే సరిహద్దుల రక్షణను బలోపేతం చేయండి (చోదన). ప్రభుత్వం, ప్రజలూ మీ వెన్నంటి ఉంటారు. ధైర్యంగా మీ విధులను నిర్వర్తించండి (సాంత్వం). అవసరమైన ధనం, ఆయుధాలు, సహాయక బల గాలు లాంటి వనరులను ప్రభుత్వం సమకూ రుస్తుంది (అభ్యవపత్తి). ఈ ఆదేశాలను సక్రమంగా పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు (భర్త్సనం). కాబట్టి దేశరక్షణను, ప్రజాహితా న్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించమని కోరుతున్నాను (అనునయం), అంటూ రాశాడు.
పై ఉదాహరణలో చాణక్యుడు చెప్పిన పదమూడు అంశాలు ప్రతిబింబించడం చూడవచ్చు. ఇక్కడ లేఖ ప్రధాన ఉద్దేశం కేవ లం సమాచారాన్ని పంచుకునే సాధనంగా కాకుండా, పరిపాలన, క్రమశిక్షణ, మానవ సంబంధాలు, ప్రేరణ, శిక్షణ, సమన్వయం వంటి అనేక ప్రయోజనాలను నెరవేర్చే సమ గ్ర సాధనంగా భావించవచ్చు.
నిజానికొక మంచి లేఖను రాయడమనే ది అత్యున్నత నైపుణ్యంగా భావించవచ్చు. సందర్భానుసారం లేఖలో విమర్శలు, ప్రశంసలూ, ప్రశ్నలు, సమాధానాలూ ఉండవ చ్చు... అభ్యర్థన, ఆజ్ఞ, నిషేధం, ఓదార్పు, సహాయం, హెచ్చరిక, వినయం.. ఇవన్నీ సందర్భానుసారంగా, అవసరానుగుణంగా లేఖలో చోటుచేసుకోవచ్చు. అందువల్ల చాణక్యుని దృష్టిలో లేఖ అనేది వార్తలను పంచుకునే సాధనం మాత్రమే కాదు... పరస్పరం ఆలోచనలను పంచుకునే ఉదాత్తమైన వేదిక. మానవ సంబంధాలను పటిష్టపరచే సాధనం... పరిపాలనను సమర్థవంతంగా నడిపించే వాహనం... రాజనీతి లక్ష్యాలను సఫలీకృతం చేసే ఉపకరణం.
ఉత్తమ లేఖ... కాలానికి అతీతంగా పరిస్థితులను మార్చగలదు, మానవ సంబంధా లను బలోపేతం చేయగలదు, బాధ్యతలను గుర్తుచేస్తుంది, అవసరమైన చోట సలహాలను ఇస్తుంది, హద్దులు దాటితే శాసిస్తుంది, అవసరమైతే ఓదార్పునూ అందిస్తుంది. కాలం మారినా, సమాచార సాధనాలు మారినా, మంచి లేఖలో ఉండవలసిన విలువలు మాత్రం మారవు. అందువల్ల, లేఖను కేవలం వాక్యాల సమాహారంగా భావించకూడదు. లేఖ వ్యక్తి వ్యక్తిత్వానికి, ఆలోచనా పరిణతికి, సంస్కారానికి, బాధ్యతాయుత ప్రవర్తనకు దర్పణంగా భావించాలి.






