సీజ్ అంటే స్టాపా? లేక సెటిల్మెంటా?
- మియాపూర్ ‘సీఎంసీ’లో వింత పోకడలు!
- తాళం వేసినా ఆగని అక్రమ నిర్మాణాలు
- సీజ్ తర్వాతే జెట్ స్పీడ్‌తో పనులు
- అధికారుల ఫిర్యాదులు నామమాత్రమే.. పోలీసుల స్పందన అంతంతే!
- కమిషనర్ గారూ.. మీ దృష్టి ఎటు?
శేరిలింగంపల్లి, మార్చి 30 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడా నికి చట్టం నిర్దేశించిన ’సీజ్’ ఆయుధం మియాపూర్ సర్కిల్ (CMC) పరిధిలో తుప్పు పట్టిపోతోంది. ఒక భవనాన్ని సీజ్ చేశారంటే అక్కడ పని ఆగిపోవాలి.. కానీ ఇక్కడ సీజ్ చేశాక పనులు మరింత వేగంగా జరుగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. సీజ్ చేయడం అనేది కేవలం యజమానులతో ’ఒప్పందాల’ కోసం వేసే ఎత్తుగడనా? అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. సీజ్ బోర్డు ఉంది.. కానీ లోపల పని సాగుతోంది.
ఏదైనా అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు రాగానే అధికారులు హడావిడిగా వెళ్లడం, నోటీసులు ఇవ్వడం, సీజ్ బోర్డు తగిలించడం జరిగిపోతున్నాయి. బయట ప్రపంచానికి ఆ భవనం సీజ్ అయినట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం యథేచ్ఛగా పనులు కొనసాగుతున్నాయి. అక్రమ కట్టడాలను ప్రారంభ దశలోనే ఆపాల్సిన అధికారులు, అవి పూర్తయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత ’సీజ్’ నాటకానికి తెరతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్.. తాళాలు పగులగొట్టి మరీ నిర్మాణాలు
మియాపూర్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అధికారులు వేసిన సీజ్ తాళాలను బరితెగించి పగులగొట్టి మరీ పనులు పూర్తి చేస్తున్నారు. దీనిపై సీఎంసీ అధికారులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, పనులు మాత్రం ఆగడం లేదు. అటు పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుండటంతో బిల్డర్లు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. సర్వే నంబర్ 44లోనూ ఇదే సీన్ వివాదాస్పద భూముల్లో సైతం సీజ్ చేసినా నిర్మాణాలు ఆగకపోవడం వెనుక భారీ స్థాయిలో చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల నిర్లక్ష్యం.. రాజకీయ అండదండలు?
ఈ అక్రమ వ్యవహారాలపై వివరణ కోరితే, సంబంధిత సెక్టార్ పోలీస్ అధికారులు ‘బిజీగా ఉన్నాం.. మాకు తెలియదు‘ అంటూ దాటవేయడం విచారణ తీరుపై అనుమానాలను పెంచుతోంది. సీజ్ చేసిన భవనంలోకి యజమానులు ఎలా ప్రవేశిస్తున్నారు? తాళాలు పగులగొట్టే ధైర్యం వారికి ఎవరిచ్చారు? దీని వెనుక స్థానిక రాజకీయ నేతల హస్తం ఉందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
కమిషనర్ చర్యలు తీసుకుంటారా?
మియాపూర్లో సాగుతున్న ఈ ’సెటిల్మెంట్ రాజ్యం’పై సీఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీజ్ ప్రక్రియ కేవలం ప్రదర్శనకేనా లేక చట్టాన్ని అమలు చేయడానికా అనేది అధికారులు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమీక్ష జరిపి, అక్రమ నిర్మాణదారులపై మరియు వారికి సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




