02-12-2025 05:01:18 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో కుక్కల స్వైర విహారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. పలు ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి గల్లీలో పదుల సంఖ్యలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి వాహనదారుల వరకు గల్లీల్లో వెళ్లడానికి జంకుతున్నారు. కరీంనగర్ నగరంలో చోటుచేసుకున్న ప్రమాద సంఘటనతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారి వెంకట రమణారావు విధులు పూర్తిచేసుకుని ద్విచక్ర వాహనంపై సంతోష్ నగర్ లోని ఇంటికి వెళ్తుండగా సిద్ధార్థ స్కూల్ సమీపంలో ఒక్కసారిగా కుక్కలు వాహనంకు అడ్డంగా రావడం, మీదికి వచ్చే ప్రయత్నం చేయడంతో రమణారావు కింద పడిపోయాడు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కరీంనగర్ అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటి సంఘటనలు నగరంలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్న నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. భగత్ నగర్, రాంపూర్ తదితర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉండగా విద్యానగర్, సంతోష్ నగర్, మంకమ్మ తోట, భాగ్యనగర్, ఇతర ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కోతుల బెడదను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.