1 September, 2026 | 8:03 PM

స్వదేశీ సుస్థిరేొంవిదేశీ అస్థిరం

08-06-2024 | 01:58am

భూమి మండుతోంది. పచ్చని చల్లని భూమిని మండే విధంగా ప్రాణవాయువు లేకుండా అగ్నిగోళంగా మార్చింది ఆధునిక మానవుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో (బుజినెస్ సైన్స్) చల్లని భూమి అగ్నిగోళంగా మారడం వల్ల మనిషి 10 నిముషాలు బయట నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. దీనిని మనం అభి వృద్ధి అంటున్నాం. అభివృద్ధికి పెద్ద కొలమానం పరిశ్రమలు. ఈ పరిశ్రమలు పర్యావరాణానికి బలాన్నిచ్చేలా ఉండాలి. అలా కాకుండా ప్రతి పరిశ్రమ 1 శాతం నుంచి 100 శాతం వరకు కాలుష్యాన్నిస్తున్నాయి. అన్ని పరిశ్రమలు మూసివేయ కున్నా విచ్చలవిడి పరిశ్రమలను నియంత్రించాలి. ప్లాస్టిక్‌ను నియంత్రించాలి.

ఈ రోజు డబ్బు ఉన్నదని డబ్బు కలిగినవాళ్లు, ప్రతి మనిషి ఒక కారు వాడుతుండ టంతో వాహనాల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోయింది. ఈ వాహనాల ద్వారా రెట్టింపు కాలుష్యం వస్తోంది. హైదరాబాద్‌లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. బొగ్గుపులుసు వాయువు పెరుగుతోంది. దీంతో నగరం వేడెక్కి పోతోంది. తద్వారా మనుషులకు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆరోగ్యకరమైన నగరం అంటే 80 శాతం ఆక్సిజన్ ఉండాలి. 20 శాతం బొగ్గు పులుసు వాయువు ఉన్న నష్టం లేదు. కానీ ఈ రోజు 80 శాతం బొగ్గు పులుసు వాయువుతో ఈ నగరం నిండి ఉంది. కాబట్టి ఆక్సి జన్ పెంచాలంటే మన ముందున్న కర్తవ్యం మొక్కలు పెంచటం. మొక్కలంటే స్వదేశీ మొక్కలు. ఇది దక్కన్ పీఠభూమి. ఈ ప్రాంతంలో టన్నులకొద్దీ ఆక్సిజన్‌ను ఇచ్చే మొక్కలు ఉన్నాయి.

ఇందులో రావి, జువ్వి, మర్రి, మారేడు, వేప మొదలగునవి. ఈ మొక్కలను పెంచాలి. హైదరాబాద్ జనాభ కోటీ ముప్పు లక్షలు. మిగతా జీవరాశులు 12 కోట్ల వరకు ఉన్నాయి. ఆక్సిజన్ ఇచ్చే రావి, జువ్వి, మర్రి, మారేడు, వేప మొక్కలు 8 కోట్లు పెంచినట్లయితే 80 శాతం ఆక్సిజన్ నగరంలో పెరుగుతుంది. 100 నుంచి 400 ఏళ్ల వయసు కలిగిన లక్షల వృక్షాలను కొట్టి వేస్తున్నారు. దీనిని అరికట్టాలంటే కఠిన చట్టాలను రూపొందించి, అమలు చేయాలి. ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలి.

ప్రస్తుతం కోనోకార్పస్ అనే ఆస్ట్రేలియా మొక్కలను హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పెంచేశారు. ఈ మొక్క వల్ల రకరకాల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నా యని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సత్వరమే ఈ మొక్కలను తొలగించాలని హైదరాబాద్ పౌరు లు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో స్వదేశీ వృక్షాలైన రావి, జువ్వి, మర్రి, మారేడు, వేప మొదలగునవి ఈ ప్రాంతం లో పెరిగే మొక్కలు. వీటిని నాటకుండా ఆస్ట్రేలియా నుంచి కొన్ని కోట్ల మొక్కలను భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు చెల్లించి పెంచాయి. డబ్బులిచ్చి జబ్బులు తెచ్చుకొనే వృద్ధి ఎలాంటి అభివృద్ధి అని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు.

మొక్కలు బతకాలంటే ప్లాస్టిక్‌ను నియంత్రించాలి. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల నుంచి వచ్చే వ్యర్థ, విష రసాయనాలు భూమిలోకి పోయి నాటిన మొక్కలు కూడా చనిపోతున్నాయి. హరిత విప్లవాల పేరు మీద గ్రీన్ రెవల్యూషన్ పేరుతో 40 ఏళ్లుగా బ్లాక్ రెవల్యూషన్ 80 శాతం అమలయిపోయింది. కాబట్టి ఆక్సిజన్‌ను ఇచ్చే మొక్కలు, అందులోనూ ఈ ప్రాంతానికి సంబంధించిన మొక్కలు కావాలి. ఒక వేప చెట్టు కొన్ని టన్నుల ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఎలాంటి మందులు, జాగ్రత్తలు లేకుండా పెరిగే మొక్క వేప.

వేప కడుపునిండా 100 శాతం ఔషధ గుణాలు కలిగిన మొక్క. వేప రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. చర్మ వ్యాధులకు అద్భుతంగా పని చేస్తుంది. రావి, జువ్వి, మర్రి, మారేడు మొక్కలు కూడా పుష్కలంగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు. సుస్థిరంగా శాస్త్రీయమైన అభివృద్ధికి దోహదం చేసే మహావృక్షాలు. ఈ వృక్షాల పండ్లను పక్షులు తిని విసర్జించేటప్పుడు వచ్చే విత్తనం 1000 టైమ్స్ శాస్త్రీయంగా, శుద్ధి చేయబడ్డ విత్తనం. పక్షులు పెంచిన ఈ మొక్క మనుషులకు ప్రాణవాయువు అయింది. మనిషి అజ్ఞానంతో, దురాశతో ఆ వృక్షాలను కొట్టి తన ప్రాణాన్ని తానే తీసుకుంటున్నడు.

చర్యలు:

1. ఆక్సిజన్ ఇచ్చే రావి, జువ్వి, మర్రి, మారేడు, వేప చెట్లను విరివిగా పెంచాలి.

2. చెట్లను నరికినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలి.

3. అదే విధంగా 100 నుంచి 400 ఏళ్ల వయసున్న మహా వృక్షాలను అది మన ప్రకృతి సంపదగా గుర్తించి అభివృద్ధికి అడ్డం వస్తే, ఆ వృక్షాలను వేర్లతో సహా పెకిలించి వేరే చోట్ల నాటాలి.

4. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలి. ప్లాస్టిక్‌ను తయారు చేసే పరిశ్రమలను నిషేధించి విడుతలవారీగా నిర్మూలించాలి. మహా వృక్షాలను కోసే యంత్రాలను నిషేధించాలి.

5. జన్యు మార్పిడి చేసిన విత్తనాలను, జంతువులను నిషేధించాలి.

ఉదా: బాయిలర్ కోళ్లు, జెర్సి ఆవులు, హెచ్‌ఎఫ్ ఆవులు మొదలగునవి.

 గోసాయి రాజన్న