సింగరేణిలో 23 అగ్రిమెంట్ల సాధన ఏఐటీయూసీ పోరాట ఫలితమే
కేటీకె 6వ గని గేట్ మీటింగులో ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి కుమార్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల 23 కీలక అగ్రిమెంట్లు సాధన ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్(AITUC General Secretary Korimi Rajkumar) అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకె 6వ గనిలో మంగళవారం పిట్ సెక్రటరీ పి శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించగా రాజ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సాధించిన 23 అగ్రిమెంట్ల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని ఇది కార్మికుల విజయమని అన్నారు. ముఖ్యంగా పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు, కార్మికుని సహజ మరణానికి రూ.20 లక్షల పరిహారం, పరిమితి లేని వైద్య సదుపాయం అందించాలని యాజమాన్యానికి కోరామని అన్నారు. అదేవిధంగా సీనియర్ మైనింగ్ సర్దార్లకు పదోన్నతులు కల్పించే అంశంలో అనేక సంవత్సరాలుగా కార్మికుల స్వంత ఇంటి పథకం అమలు చేయాలని కోరడం జరిగింది.
త్వరలోనే యాజమాన్యం అమలు చేస్తుందని అన్నారు. మారు పేర్ల సమస్య పరిష్కారం చూపడం కోసం వన్ టైం సెటిల్మెంట్ మాదిరిగా సమస్యకు పరిష్కారం చూపాలని, సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్ఈ సెలబస్ అమలుచేయాలని, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి కార్మికులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని కోరడం జరిగిందని యాజమాన్యం త్వరలోనే వాటిని అమలు చేస్తుందని తెలిపారు. ఈ గేట్ మీటింగులో ఏఐటీయూసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.






