2 April, 2026 | 3:13 AM

అనాథలైన చిన్నారులకు ‘డిజిటల్’ అభయం

02-04-2026 12:50 AM

వాట్సాప్ పోస్ట్‌తో సాయం అందించిన దాతలు

కేసముద్రం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఇంటికి జీవనాధారమైన కుటుంబ పెద్ద అకాల మృత్యువాత పడగా, ఆ నిరుపేద కుటుంబం దయనీయ పరిస్థితి ని వివరిస్తూ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టింగ్ కు దాతలు సహకరించి అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.సోషల్ మీడియాను కేవలం చాటింగ్లకే కాకుండా, ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచేందుకు వాడవచ్చని ఇనుగుర్తి గ్రామస్థులు నిరూపించారు.

అకాల మరణం చెందిన నిరుపేద పడాల అశోక్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మా ఊరు ఇనుగుర్తి’ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన పోస్టింగ్ కు దాతలు స్పందించి తలా కొంత చేయూతనందించారు. ఈ విధంగా సమకూరిన 25 వేల నగదు, 3 క్వింటాళ్ల బియ్యం కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడిన అశోక్ భార్యాపిల్లలకు బుధవారం అందజేశారు. సాయం అంటే కేవలం ఈరోజుకు మాత్రమే కాదని, ఆ పిల్లల భవిష్యత్తుకు పునాది కావాలని భావించిన గ్రూప్ సభ్యులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

అశోక్ కుమారులు పడాల ఇలియారాజ్, యశ్వంత్ రాజ్ పేర్ల మీద పోస్టాఫీసులో ఫికస్డ్ డిపాజిట్ చేయించి, ఆ బాండ్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్త్స్ర కరుణాకర్ మాట్లాడుతూ కాలక్షేపానికి కేరాఫ్ అడ్రస్గా మారిన సోషల్ మీడియాను, ఇలాంటి సామాజిక సేవకు వాడటం గొప్ప విషయమని, ఇనుగుర్తి వాట్సాప్ గ్రూప్ చొరవ మిగతా గ్రామాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి కవచంలా నిలిచిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు.