10 May, 2026 | 1:24 AM

పంటలు ఎండినా పట్టించుకోరా?

14-03-2025 12:42 AM
  1. దీనిని కూడా కేంద్రంపై నెట్టేస్తారా?
  2. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ర్టంలో పంటలు ఎండిపోతున్నాయని.. రాష్ర్టవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేసినా ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలకపోవడంవల్ల ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజ య్ తెలిపారు.

ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని.. అయినా ప్రభు త్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయన్నారు. ఫలితంగా వానాకాలంలో రికార్డు స్థాయిలో 160 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.

నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలోనూ 56లక్షల ఎకరాల్లో వరి, మరో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటతో పాటు జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు కూడా వేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి పంటలు వేసేటప్పుడు రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు.

యాసంగిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే అంశానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ అమలు చేయలేదన్నారు. మరో నెల రోజుల్లో పంటలు కోతకు రాబోతున్న తరుణంలో పొలాలకు నీరందక పోవడంవల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. చెరువుల్లో నీరు తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు, బోర్ల కింద పంటలన్నీ ఎండి నేలరాలుతున్నాయని తెలిపారు.

ముమ్మాటికీ ఇది రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఎండగట్టారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ, సింగూరు సహా రాష్ర్టంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయన్నారు. దీనిని కూడా కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఇందులో 150 టీఎంసీల మేరకు డెడ్ స్టోరేజీ పోగా, మరో 190 టీఎంసీలకుపైగా నీరు అందుబాటులో ఉందన్నారు. తాగునీటి అవసరాలకు మినహాయించి మిగిలిన నీటిని సకాలంలో విడుదల చేసి చెరువులు నింపినట్లయితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదన్నారు. ఎండిపోతున్న పంటలను రక్షించడానికి రైతులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతోందన్నారు.

పంటలు ఎండిపోయి పశువుల మేతకు వదిలేస్తున్నా.. ఎండిన పంటను తగలబెడుతున్నా వ్యవసాయశాఖ మేల్కోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే రైతు భరోసా సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నాని.. రుణమాఫీ పూర్తిగా అమలు కాక 20 లక్షలకుపైగా రైతులు అప్పులు చెల్లించకలేక అల్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మార్క్  రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా అని ప్రశ్నించారు.

కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే రాష్ర్ట రైతాంగం పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలని.. అసెంబ్లీ సాక్షిగా రైతులను ఆదుకునేందుకు సాగునీటిని అందిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.