నేను ఎవరి ట్రాప్‌లో పడను!
ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, మార్చి13(విజయక్రాంతి) : ‘నేనెవరో తెలియకుండా నే నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఏఐఐ సీ నాకు బాధ్యతలు అప్పగించిం దా? నేనెవరో తెలియకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత నాకు సీఎం పదవి కట్టబెట్టిందా? నేను ఎవరి ట్రాప్‌లో పడను. గాంధీ కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ విషయాన్ని గాంధీ కుటుంబ సభ్యులతో నేను ఫొటో దిగి మరీ నిరుపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఢిల్లీలో గురువారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో మీడియా అడిగిన ప్రశ్న లకు సీఎం బదులిచ్చారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడం లేదని, కేసీఆర్ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావా ల్సిన ఫలాల కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ని నిలదీస్తున్నామని తెలిపారు.
మెట్రో ఫేజ్ మూసీ ప్రక్షాళన పనులకు కేంద్రం నుం చి అనుమతులు రాగానే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమిళనాడులో మెట్రో పనులు చేపట్టేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కృషి చేశారని, ఆ రీతిలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు 253 ఎకరాలను భూమి సేకరిస్తామని తెలిపారు.
పన్ను వసూళ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత నిరుద్యోగం 8.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ పాలనలో రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
త్వరలో తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సమ్మిట్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. సమ్మిట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావ్వాల్సి ఉందని, ఈ అంశంపై చర్చించేందుకే తాము విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో భేటీ అవుతున్నామని వెల్లడించారు.
అలాగే హైదరాబాద్‌లో మిస్ ఇండియా పోటీలు సైతం నిర్వహిస్తామని, పోటీలకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పోటీల నిర్వహణకు రెండు రోజుల్లో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారికి, పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారమే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టామని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు.






