17 April, 2026 | 12:37 PM

తూప్రాన్ తహసిల్దార్ ఆదేశాలతో ఇంటింటికీ సర్వే

21-02-2026 10:23 PM

ఇమాంపూర్‌ లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక శ్రద్ధ

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామంలో భూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తూప్రాన్ తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది శనివారం ఉదయం గ్రామానికి చేరుకొని సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టారు. గ్రామస్తుల నుండి అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని, భూ రికార్డుల సవరణ, పట్టాదార్ పాస్‌బుక్స్, వారసత్వ మార్పులు, సర్వే సమస్యలు, సరిహద్దు వివాదాలు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన నిర్వహించారు.

గ్రామాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి, సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించారు.ఈ సందర్భంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల భూ సమస్యలను తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే ఇతర సమస్యలైన ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను నమోదు చేసి, తక్షణ పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.