2 May, 2026 | 4:06 AM

డబుల్ బొనాంజా

08-02-2025 12:04 AM

దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఫిబ్రవరి నెలలో డబుల్ బొనాంజా దక్కింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం రెండు తీపి వార్తలను ఈ వర్గానికి అందించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఎవరూ ఊహించని విధంగా రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం పన్ను రాయితీని ప్రకటించడంతో మధ్య తరగతి, ముఖ్యంగా వేతనజీవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఈ రాయితీ కారణంగా ఏడాదికి రూ.25 లక్షలు ఆర్జించే ప్రతి ఉద్యోగికి కూడా దాదాపుగా లక్ష రూపాయల దాకా పన్ను రూపేణా ఆదా అవుతుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనివల్ల దాదాపు అయిదేళ్ల తర్వాత గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఇది ఎంతో ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. గత అయిదేళ్లుగా గృహరుణాల వడ్డీ రేట్లు పెరగడమే తప్ప తగ్గడం చూడని వారికి ఇది సువర్ణావకాశంగా మారనుంది. వడ్డీరేట్లు తగ్గనుండడంతో గృహ రుణాలపై తాము చెల్లించే ఈఎంఐల మొత్తం ప్రస్తుతంకన్నా తగ్గుతుంది.

తద్వారా మొత్తం రుణ కాలపరిమితి ముగిసే నాటికి కనీసం నాలుగైదు లక్షల మేర లబ్ధి చేకూరుతుంది. అంతేకాదు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా ఆర్‌బీఐ నిర్ణయంతో ఊరట లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నాడనుకుందాం. 9 శాతం వడ్డీ అనుకుంటే నెలకు దాదాపు 45 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తంలో నెలకు దాదాపు రూ.800 ఆదా అవుతుంది. అంటే 20 ఏళ్లలో రూ. 2 లక్షలకుపైగా ఆదా అవుతుంది. అలాకాక కాల వ్యవధిని తగ్గించుకుంటే పది నెలల ముందే రుణం ముగుస్తుంది. బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయం పన్నురాయితీ, గృహరుణాలపై వడ్డీ తగ్గింపు రెండూ కలుపుకొంటే ఏటా సగటున రూ.25 లక్షల వేతనం పొందే ఉద్యోగికి దాదాపుగా ఏడాదికి రూ.1.37 లక్షల దాకా ఆదా అవుతుందని అంచనా.

ఇలా ఆదా అయిన మొత్తాన్ని వారు మార్కెట్లోకి మళ్లిస్తారు. తద్వారా దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందనేది ప్రభుత్వం ఆలోచన. మరోవైపు ఆర్‌బీఐ నిర్ణయం అటు రియల్టీ రంగానికి కూడా టానిక్‌లాగా పని చేస్తుందని చెప్పవచ్చు. గృహాల ధరలు పెరగడం వల్ల నగరాల్లో చాలా వెంచర్లలో ఇళ్లు అమ్ముడుకాక అలాగే ఉండిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది.

అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించిన నిర్మాణ సంస్థలు అవి అమ్ముడు కాక, తక్కువ ధరలకు విక్రయించడానికి మనసు రాక నలిగి పోతున్నారు. ఇప్పటికే చాలామంది తాము పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తే చాలనుకుని ధరలు తగ్గించి అమ్ముతున్నారు. ఆర్‌బీఐ నిర్ణయంతో ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది. 

రాబోయే రోజుల్లో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకుంటాయని, తమ కష్టాలు తీరుతాయని వారంతా ఆశగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి బడ్జెట్‌లో కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పాటుగా ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆ రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. ఈ రంగం బాగుంటే దాని ప్రభావం అనేక రంగాలపై ఉంటుంది.

వేలాది మంది కార్మికులకు చేతినిండా ఉపాధి లభిస్తుంది. స్టీల్, సిమెంట్‌లాంటి అనుబంధ రంగాలపైనా సానుకూల ప్రభావం ఉంటుంది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న ధోరణులు కనిపిస్తుండడంతో మళ్లీ పుంజుకునేలా చేయడానికి అటు ఆర్థిక మంత్రి, ఇటు ఆర్‌బీఐ సరైన నిర్ణయాలే తీసుకోవడం విశేషం.

అయితే ఆర్‌బీఐ ప్రకటించిన వడ్డీ రేటు తగ్గింపును బ్యాంకులు కస్టమర్లకు అందించడానికి కొంత సమయం అవసరం కనుక ఫలితాలు కనిపించాలంటే మరో రెండు, మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది.