2 May, 2026 | 2:56 AM

ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు?

08-02-2025 12:00 AM

విద్యారంగంలో డిప్యూటీ ఈ.ఓ. పోస్టులది కీలకమైన పాత్ర. ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ అయ్యే ఉన్నతమైన పోస్ట్ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో ఈ పోస్టులు చివరిసారిగా నింపారు. తదుపరి ఆ పోస్ట్‌ల ఊసే లేదు. ప్రస్తుతం జిల్లా విద్యాధికారులే జిల్లాలోని మొత్తం పాఠశాల పరిపాలన బాధ్యతలను చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఈ పోస్టులను నింపలేదు. 2018లో జిల్లాల పునర్విభజన జరిగింది. అప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ డైట్, బీఎడ్ కళాశాల అధ్యాపకులను, ఎస్‌ఈఆర్‌టీ ప్రొఫెసర్లను ఇంచార్జ్ జిల్లా విద్యాధికారులుగా నియమించి సరిపెట్టారు. ఇప్పుడు 21 జిల్లాల విద్యాధికారులు ఎఫ్‌ఏసీల అదనపు బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు.

పూర్తి స్థాయి జిల్లా విద్యాధికారులు లేరు. ఎట్టకేలకు 24 ఉప విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి 2022 నవంబరు 12న ఆర్థికశాఖ అనుమతిచ్చినా, ఇప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం గమనార్హం. డిప్యూటీ ఈ.ఓ. పోస్టులు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. దీంతో డీఈఓ కార్యాలయాల్లో పనులు కుంటుపడుతున్నాయి.

గతంలో ఈ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు. కానీ, ఇటీవల ప్రభుత్వం వీటిని గ్రూప్ కలిపి నింపాలని యోచిస్తున్నది. తద్వారా ఆ పోస్టుకు తగిన నైపుణ్యం గల అధికారి నియామకం జరగదని విద్యావేత్తల అభిప్రాయ పడుతున్నారు. 

 సంపతి రమేష్ మహారాజ్