23 June, 2026 | 6:25 PM

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

23-06-2026 05:25 PM

* ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..

ఉట్నూర్,(విజయక్రాంతి): సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి  మంద మకరందు గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు)ఉట్నూర్ ను సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలు మరియు విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆ రోజు అమలవుతున్న మెనూ వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, ఇతర సౌకర్యాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. తదుపరి ఉపాధ్యాయులు మరియు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ప్రాజెక్టు అధికారి, విద్యార్థుల విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలు, ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వసతి గృహాలు, తరగతి గదులు, ఇతర భవనాల్లో మరమ్మత్తులు అవసరమైతే వెంటనే చేపట్టి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే పాఠశాల వంటగది ఆవరణలో ఆకు కూరగాయల నర్సరీని ఏర్పాటు చేసి పోషకాహార అవసరాలకు ఉపయోగపడేలా చూడాలని తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిల్వ నీటి కారణంగా దోమలు వ్యాప్తి చెంది విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వ కాకుండా పారిశుద్ధ్య చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, పోషకాహారం మరియు భద్రత అంశాల్లో రాజీ లేకుండా పనిచేయాలని ప్రాజెక్టు అధికారి స్పష్టం చేశారు. ఆయనతోపాటు  ఐటిఐ విద్యా విభాగం  డిప్యూటీ డిఇఓ  గోడం చందన్ ల తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.