23 June, 2026 | 6:02 PM

నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి

23-06-2026 05:10 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 190, 450, 433, 997లకు చెందిన భూములపై విధించిన ప్రొహిబిషన్‌ను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఆయా సర్వే నంబర్ల పరిధిలోని రైతులు గత అనేక సంవత్సరాలుగా పట్టాదారులుగా కొనసాగుతున్నారని, వారిలో చాలామందికి అనువంశిక హక్కులతో పాటు ప్రభుత్వం జారీ చేసిన అసైన్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ సంబంధిత భూములను ప్రొహిబిషన్ జాబితాలో ఉంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో పాటు అత్యవసర అవసరాల కోసం భూములను విక్రయించలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత సర్వే నంబర్లపై ఉన్న ప్రొహిబిషన్‌ను తొలగించాలని, తద్వారా రైతులు తమ భూములపై పూర్తి హక్కులు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.