16 July, 2026 | 10:20 AM

రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాసం!

10-12-2024 12:39 AM

* నోటీసుపై ఎంపీల సంతకాలను సేకరిస్తోన్న ఇండియా కూటమి

* అధికార పక్షానికి జగదీప్ ధన్‌ఖడ్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ఆర్టికల్ 67(బీ) ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. ఇందులో భాగంగా తీర్మానానికి సంబంధించిన నోటీసుపై ప్రతిపక్ష ఎంపీల సంతకాలు సేకరిస్తోంది. తృణముల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర పార్టీలకు చెందిన దాదాపు 70 మంది ఎంపీలు ఈ నోటీసుపై ఇప్పటికే సంతకాలు పెట్టారు. సభలో ధన్‌ఖడ్ తమ గొంతు నొక్కేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ వ్యవహారంపై చర్చించాలంటూ కాంగ్రెస్ గట్టిగా పట్టుపడుతోంది.

దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాజ్యసభ సమావేశం అయిన తర్వాత వ్యాపారవేత్త జార్జి సోరెస్‌తో కాంగ్రెస్ నేతలకు లింకులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఆరోపణలై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగా ఆయన మైక్ పలుమార్లు నిలిచిపోవడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. అధికార పక్షానికి ధన్‌ఖడ్ సపోర్ట్ చేస్తున్నారని విపక్షాలు ఆందోళనలకు దిగాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి సర్ధుమనగకపోవడంతో ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

ఈ ఏడాదిలో ఇది రెండోసారి

బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆగస్ట్‌లో జగదీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. పారీస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హతపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఆ సందర్భంగా ప్రభుత్వానికి ధన్‌ఖడ్ వత్తాసు పలుకు తున్నారని ఆరోపించాయి. అంతేకాకుండా బడ్జెట్  సమావేశాలు ముగియడానికి ముందురోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసుపై ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. అయితే సమావేశాలు ముగియడంతో తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టలేకపోయారు. తాజాగా మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లు

జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ వీలు పడని పక్షంలో వచ్చే సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సిఫార్సు చేసే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలపై భిన్నాభప్రియాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు సమాచారం.

మోదీ, అదానీలను ఇంటర్వ్యూ చేసిన రాహుల్

పార్లమెంట్ సమావేశాల్లో అదనీ వ్యవహారంపై చర్చ జరపాలని గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్న కాంగ్రెస్.. సోమవారం వినూత్నంగా నిరసన తెలిపింది. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక తమ ముఖాలకు ప్రధాని నరేంద్రమోదీ, అదానీల ఫొటోలున్న మాస్కులు పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారిద్దరినీ ఫొటో తీస్తూ.. మీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో వాళ్లిద్దరూ స్పందిస్తూ మాది ఏళ్లనాటి బంధం, ఏది చేసినా కలిసే చేస్తామంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.